May 12, 2025

Digital Mixture

Information Portal

దడ పుట్టిస్తున్న కొత్త రకం కరోనా- Strain Virus

1 min read
Corona Cases increasing day by day in India

Corona Cases increasing day by day in India

కోవిడ్ -19 వైరస్ మహమ్మారి రూపం ( స్టెయిన్ కరోనా ) మార్చుకుని వివిధ దేశాల్లో మళ్లీ దాడి చేస్తోందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటన్లో కొత్త స్టెయిన్ వైరస్ బయటపడడం మరోమారు మహమ్మారి విజృంభిస్తుందా ? అన్న ప్రశ్న సామాన్యుడిని వేధిస్తోంది. లాక్ డౌన్ నష్టాల నుండి మార్కెట్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరోసారి లాక్ డౌన్ మాటెత్తితే జనం వణికిపోయే పరిస్థితి తలెత్తింది. యునైటెడ్ కింగ్ డమ్ ( బ్రిటన్ ) నుండి విమానాలను కేంద్రం రద్దు చేసినా ఇప్పటికే చాలా మంది భారత్ కు చేరుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బ్రిటన్ నుండి వచ్చిన వారుండడంతో ఇప్పుడు వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.

ఢిల్లీ , హైదరాబాద్ , కేరళ విమానాశ్రయాలకు బ్రిటన్ నుండి చేరుకున్న తర్వాత స్వస్థలాలకు రావడానికి ముందు ఎక్కడెక్కడికి వెళ్లారు ? ఎవరిని కలిసారు ? కోవిడ్ -19 లక్షణాలు ఏమైనా ఉన్నాయా ? ఇంట్లో వాళ్లలో ఆ లక్షణాలేమైనా కనిపిస్తున్నాయా ? లాంటి సంపూర్ణ వివరాలను సేకరిస్తున్నారు. బ్రిటన్ లో మరోమారు కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న నేపధ్యంలో అక్కడి నుండి కర్నూలు జిల్లాకు వచ్చిన వారు కూడా ఉండడం కొంత ఆందోళన కలిగించే పరిణామమే. అయితే అధికారులు మాత్రం ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని , బ్రిటన్ నుండి వచ్చిన వారిని గుర్తించి వారికి పరీక్షలు చేయించి వారిని ఐసోలేట్ చేసేందుకు యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నట్లు చెబుతున్నారు. లాక్ డౌన్ కు ముందు కర్నూలులో ఒక్క కేసు నమోదు కాగా , ఆ తర్వాత ఢిల్లీ మర్కత్ వ్యవహారంతో కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిన విషయం తెలిసిందే .

ఆ సమయంలో దేశంలోనే కర్నూలు జిల్లా కోవిడ్ -19 కు హాట్‌స్పాట్ గా మారింది. కోవిడ్ -19 వ్యాప్తిలో దేశంలో కర్నూలు జిల్లా మొదటి స్థానాల్లో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. రోజూ 2 నుండి 3 వేల కేసులు కూడా నమోదు కావడం సంచలనం సృష్టించింది . ఇప్పటి వరకు జిల్లాలో కోవిడ్ -19 మహమ్మారి సోకిన వారి సంఖ్య 60,508 కాగా , 59,929 మంది కోలుకున్నారు . కరోనా బారిన పడి 487 మంది మరణించారు. యాక్టివ్ కేసులు వందలోపే ఉన్నాయి. పదిహేను రోజుల క్రితం కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య కొద్దిగా పెరిగినా ఆ తర్వాత అది బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండంకెలకు కూడా చేరుకోవడం లేదు. స్టేట్ కోవిడ్ ఆసుపత్రిగా ఉన్న కర్నూలు సర్వజన వైద్యశాలలో ప్రస్తుతం 20 మంది కరోనా పాజిటివ్ బాధితులు చికిత్స పొంతున్నారు .

అయితే , బ్రిటన్లో స్ట్రెయిన్ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో కర్నూలు జిల్లాలోనూ అక్కడి నుండి వచ్చిన వారు కనిపిస్తుండడంతో కోవిడ్ -19 సెకండ్ వేవ్ తప్పదా ? అన్న భయం జనంలో ప్రారంభమైంది. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రాత్రి పూట నిర్బంధ కర్ఫ్యూ , పగటి పూట కొంత మేర లాక్ డౌన్లు అమలు చేస్తుండడంతో ఇక్కడా అలాంటి పరిస్థితి తప్పదా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి . సోషియల్ మీడియాలో కొత్త సంవత్సర వేడుకలను ప్రభుత్వం రద్దు చేయబోతోందంటూ వస్తున్న సమాచారం ప్రజలు , వ్యాపారుల్లో హాల్ చల్ చేస్తోండంగా బ్రిటన్ నుండి 44 మంది కర్నూలు జిల్లాకు వచ్చినట్లు అందుతున్న సమాచారం మరింత భయాన్ని రేకెత్తిస్తోంది .

ఈ పరిస్థితుల్లో కోవిడ్ -19 నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే మళ్లీ మహమ్మారి విజృంభిస్తుందనడంలో సందేహం లేదు. మాస్కులు ధరించడం , శానిటైజర్ వాడడం , చేతులు శుభ్రంగా ఉంచుకోవడం , భౌతికదూరం పాటించడం లాంటివి అమలు చేయగలిగితే కరోనా -19 వ్యాప్తిని నియంత్రించడం పెద్ద కష్టమేమీ కాదన్నది ఇప్పటికే నిరూపితమైంది. క్రిస్మస్ , వైకుంఠ ఏకాదశి కలిసి రావడం , కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే పేరుతో గుంపులు గుంపులుగా చేరడం లాంటివి నియంత్రించుకునే వైపు ప్రజలు , అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *