రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్న ఎంపీలు…
1 min read
Rajya Sabha
రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు గురువారంనాడు కన్నీటి పర్యంతమయ్యారు. రైతుల ఆందోళనపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతెన్నులపై ప్రతిపక్ష సభ్యులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. మీకు చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాం అంటూ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. వ్యవసాయ సంస్కరణల పేరుతో చేసిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తుంటే మంత్రులు ఏకపక్షంగా దండకం చదివినట్టు తమ ధోరణిలో తాము మాట్లాడుతూ తమ వాదనే వినిపించడంతప్ప వినికిడి సహనం కోల్పోయిందని, రైతులు ర్యాలీ చేస్తుంటే వారు వచ్చే దారిలో గోతులు తవ్వి, మేకులు నాటి, ముళ్ళ తీగలు అడ్డంగా కట్టేసి, ఇనప కొయ్యలు పాతి, వాడిగా ఉండే ఇనుప మేకులు పెట్టి ఆటంకాలు సృష్టి స్తారా ? రైతుల మనసులు గెలుచుకునేందుకు వారధులు నిర్మించడం మానేసి ఇలాంటి చర్యలకు పాల్పడతారా ? అంటూ ప్రతిపక్ష సభ్యులు కన్నీళ్ళు పెట్టుకున్నారు .
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం నాడు రెండోరోజు చర్చ సందర్భంగా ఆర్జేడీ సభ్యుడు మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ , ప్రభుత్వం వినే సహనం కోల్పోయిందని , ప్రజాస్వామ్య బద్రంగా చేసే ఎలాంటి విమర్శలనైనా జాతి వ్యతిరేక ప్రసంగాలుగా రంగులు పులుముతోందని విమర్శించారు. “ ముకుళిత హస్తాలతో చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నా … దయచేసి అర్థం చేసుకోండి , రైతుల కష్టాన్ని , వారి బాధలను , వారు పడుతున్న పాట్లనీ గుర్తించండి , అర్థం చేసుకోండి, ఈ శీతాకాలంలో భయంకరమైన చలిలో మీరు రైతుల మరుగుదొడ్లకు నీటి సరఫరా కూడా లేకుండా నిలిపేస్తారా ? నడిచేదారిలో కందకాలు తవ్వుతారా ? ముళ్ళతీగలు అడ్డంగా కట్టేస్తారా ? ఇనుప కొయ్యలు పాతేసి మేకులు దిగేస్తారా ? ఇదేనా ? .. ” అని ప్రశ్నించారు మనోజ్ కుమార్ ఝా . “ ఇలాంటి చర్యలు తమ భూభాగంలోకి రాకుండా ఉండటానికి సరిహద్దుల్లో పొరుగు దేశాలు చేసినట్టు కూడా వినలేదు ” అన్నారాయన .
పాప్ స్టార్ రిహన్నా రైతు ఆందోళనపై స్పందించడంపై ఆయన మాట్లాడుతూ , ఒక్క ట్వీట్ చేసినంత మాత్రాన ప్రజాస్వామ్యం ఏమీ బలహీనపడి పోదు , ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికంటే , ఇదేమీ బలహీనపరచేది కాదు అన్నారు . ఆదానీ గ్రూప్ వంటి ప్రైవేటు కార్పొరేట్లు గొలుసుకట్టు కోల్డ్ స్టోరేజీలు , గోదాములు నిర్మించడాన్ని ప్రస్తావిస్తూ , మీ వెన్నుదన్ను రైతులే 303 ( సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి గెలుచుకున్న సీట్ల సంఖ్య ) సీట్లు కోల్డ్ స్టోరేజీల నుండో , గోదాముల నుండో రాలేదు , ఈ ప్రజల నుండే వచ్చాయి అన్నారు . మేం మీకు మద్దతు ఇస్తాం , కానీ ప్రతిదీ జాతి వ్యతిరేకం అనుకోకండి , దేశభక్తి అంటే స్లీవులు తొడుక్కున్నట్టు కాదు , దేశభక్తి హృదయంలో ఉండాలి , హృదయంలో మోసుకుని తిరగాలి అన్నారు . పదకొండు విడతలు చర్చలు జరిపారు , మంత్రులు దండకంలాగా ఏకపక్షంగా మాట్లాడా రుతప్ప సమస్య పరిష్కరించలేదని విమర్శించారు .
కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చర్చలో పాల్గొంటూ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు . దేశంలో సుమారు 50 లక్షల మంది నిరుద్యోగులయ్యారు , చిన్న పరిశ్రమలు ధ్వంసమయ్యాయి అన్నారు. మోడీ ప్రభుత్వం పెద్ద వాగ్దానాలు చేసినా , ప్రజల హృదయాల్ని గెలుచుకోలేదని విమర్శించారు . కరోనా తీరుతెన్నుల్ని సరిగా నిర్వహించలేకపోయిందని , అవినీతికి ఆజ్యం పోసిందని అన్నారు . ప్రధాని విశ్వాసం కోల్పోయారని , చివరకు భారతీయ కిసాన్ సంఘ్ కూడా కొన్ని ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించిందని చెబుతూ , అసలు ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు నిలబెట్టుకోవాలని ప్రభుత్వం అనుకుంటోందా లేదా అన్నారు . మాజీ ప్రధాని , జెడి ( ఎస్ ) నాయకుడు . హెడ్ దేవెగౌడ మాట్లాడుతూ , రైతులు దేశానికి వెన్నుముక అన్నారు . గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనల వెనుక నేరస్తులున్నారని , ఈ చర్యలను అన్ని పార్టీలూ ఖండించాయని అన్నారు .
