CoWIN: నమోదు చేసుకున్న వారికే టీకా..!
1 min read
Corona Cases increasing day by day in India
రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు , 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ( టీకా ) ఇవ్వనున్నారు. ఆన్ లైన్ లో తమ పేర్లను నమోదు చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ పూర్తి చేసింది. సుమారు 50 లక్షల మంది వరకు టీకాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసిన వైద్య ఆరోగ్య శాఖ దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 102 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా అందులో 45 ప్రభుత్వ , 57 ప్రైవేటు కేంద్రాలు న్నాయి. ప్రతి జిల్లాలో రెండు కేంద్రాలు , హైదరాబాద్ లో 12 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు గుర్తింపుకార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని , లేదా కొవిన్ (CoWIN) వెబ్ సైట్లో అప్లోడ్ చేయాలని వైద్యధికారులు తెలిపారు. వ్యాక్సిన్ కేంద్రాలకు సం బంధించిన సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సేకరించడం తో పాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోనుంది.
‘ కొవిన్'(CoWIN)లో నమోదు చేసుకోండి : డాక్టర్ శ్రీనివాసరావు
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేవారు తమ మొబైల్ నంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా COWIN.GOV.IN లో పేర్లను నమోదు చేసుకోవాలని ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు . కోఠిలోని డిఎంహెచ్ కార్యాలయంలో డిఎంఇ రమేష్ రెడ్డితో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ తర్వాత మొబైల్ కు వచ్చిన లింక్ ద్వారా దగ్గరలోని వ్యాక్సిన్ కేంద్రంలో టీకా తీసుకోవచ్చని వివరించారు. తొలి డోసు తీసుకున్న 28 నుంచి 45 రోజుల్లోపు రెండో డోసు ఇస్తామని చెప్పారు .20 రకాల దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించామని తెలిపారు . ప్రభుత్వ కేంద్రాల్లో టీకా పూర్తిగా ఉచితమని , ప్రైవేటు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టీకా ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ప్రైవేటు కేంద్రాల్లో టీకాకు రూ.150 , సర్వీస్ చార్జి రూ.100 తీసుకోవ చ్చని , సర్వీస్ చార్జి లేకుండా కూడా టీకా ఇవ్వొచ్చని వివరించారు .
వచ్చేవారం వెయ్యికిపైగా కేంద్రాలు : రమేష్ రెడ్డి
రానున్న వారం రోజుల్లో వెయ్యికిపైగా టీకా కేంద్రాలను పెంచనున్నట్టు డిఎంఇ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. తొలిరోజే టీకాలు తీసుకోవాలని అనుకోవద్దని , తద్వారా పెద్ద క్యూ ఉంటుందని చెప్పారు . ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. టీకా కేంద్రాల్లో వృద్ధుల కోసం వీలైనంత వరకు వీల్ చైర్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
