May 12, 2025

Digital Mixture

Information Portal

సూర్యాపేటలో దారుణం, కుప్పకూలిన స్టేడియం గ్యాలరీ, పరిస్థితి విషమం

1 min read
సూర్యాపేటలో దారుణం, కుప్పకూలిన స్టేడియం గ్యాలరీ, పరిస్థితి విషమం

సూర్యాపేటలో దారుణం, కుప్పకూలిన స్టేడియం గ్యాలరీ, పరిస్థితి విషమం

సూర్యాపేటలో జరుగుతున్న జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల్లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది . స్టేడియంలోని మూడో నెంబర్ గ్యాలరీ కుప్పకూలి దాదాపు 200 మందికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది .

ఒక్కసారిగా జరిగిన ఘటనతో అంతా ఉలిక్కి పడ్డారు. వెంటనే అక్కడున్న వారు గాయాల పాలైన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాలరీ కూలిపోవడంతో చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రక్షించాలంటూ వారు చేసిన రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నారు. 47 వ జాతీయ కబడ్డీ ఛాంపియన్ షిప్ ప్రారంభమైన కాసేపటికే ఈ ఘటన జరిగింది. స్టేడియం గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు రోజులపాటు జరిగే కబడ్డీ పోటీకి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. కబడ్డీని వీక్షించడానికి 15,000 మందికి ఏర్పాట్లు చేశారు. మైదానం చుట్టూ మూడు గ్యాలరీలను ఏర్పాటుచేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి క్రీడలను ప్రారంభించాల్సి ఉండగా కాస్త ఆలస్యమైంది. ఆహ్వానితులు వేదికపైకి రాకముందే 7 గంటల సమయంలో తూర్పువైపున ఏర్పాటు చేసిన గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో తుంగతుర్తి ఎంఎల్ఎ గ్యాదరి కిషోర్ కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అక్కడే వేదికపై నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో గ్యాలరీ కూలడంతో పెద్ద శబ్దం వచ్చింది . గ్యాలరీ పైన కూర్చున్నవాళ్లు పెద్ద ఎత్తున కేకలు వేశారు.

ఈ ప్రమాదంలో 200 మందికి పైగా గాయాలయ్యాయి. గ్యాలరీ కోసం ఏర్పాటుచేసిన ఇనుప కడ్డీల కింద వీక్షకులు ఇరుక్కుపోయారు. కొంతమందికి కాళ్లు, చేతులు, నడుములు విరుగగా, మరికొంతమందికి తలలు పగిలాయి. ఈ ప్రమాదంలో చిన్నారులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. దాంతో అక్కడే ఉన్న సూర్యాపేట ఎస్పి భాస్కరన్ సహా ప్రజాప్రతినిధులు అందరూ ఏం జరిగిందో తెలియక షాక్ కు గురయ్యారు. వెంటనే తేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు పట్టణంలోని వివిధ ప్రైవేటు హాస్పిటల్స్ కు తరలించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాలతో పరిస్థితి విషమంగా ఉన్నవారిని నార్కెట్పల్లి, హైదరాబాద్ కామినేని ఆసుపత్రులకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *