కరోనా కేసులను అరికట్టే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం… పలు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ…
1 min read
Corona Ristrictions In Telangana
ఈ ఆంక్షలు కరోనా కేసుల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేనా…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిమీద తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏప్రిల్ 30 వ తేదీ వరకు సామూహిక కార్యక్రమాల పై నిషేధం విధించింది. అన్ని పండగలపై, యాత్రలు ర్యాలీల పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. రాబోయే పండగ లైన హోలీ, శ్రీరామ నవమి వేడుకల్లో జనాలు ఒక దగ్గర గుమికూదవద్దని ఆదేశాల్లో పేర్కొంది. మత పరమైన సమావేశాలకు కూడా అనుమతి లేదని తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని లేకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న దశలో దీనిని అరికట్టడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతోంది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరింది.
కాగా తెలంగాణలో గడచిన 24 గంటల్లో 495 పాజిటివ్ కేసు నమోదు కావడం పై మరింత ఆందోళన కలిగిస్తోందని చెప్పొచ్చు. తాజాగా కరోనాతో ఇద్దరు మృతి చెందడం జరిగింది. నిన్న ఒక్కరోజులోనే 247 మంది కరోనా నుండి బయట పడ్డట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి 4281 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1870 కరోనా బాధితులు హోమ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3, 05,804 కి చేరింది. ఇక మొత్తం మృతుల సంఖ్య 1,685 కు చేరింది.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఆంక్షలకు సంబంధించిన జీవో ని విడుదల చేసింది. కానీ కొందరు ఈ ఆంక్షలపై పెదవివిరుస్తున్నారు. ఎందుకటే సినిమా హాళ్ళు, బార్ & రెస్టారెంట్లు, వైన్ షాప్స్, హోటల్స్ , షాపింగ్ మాల్స్ ఇలా అన్ని తెరచి ఉంచడం పై పలు బిన్నాభిప్రాయాలు వెలుబడుతున్నాయి. స్కూల్స్ మూసేసిన ప్రభుత్వం, వైన్స్, బార్ & రెస్టారెంట్స్, సినిమా హాళ్ళు, హోటల్లు ఎందుకు మూసేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇవ్వన్ని తెరిచి ఉంచి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా కరోనా కేసులు పెరుగుదలను అరికట్టడం కష్టతరమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
