#TS Budget 2021-22: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఇవే….
1 min read
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఇవే....
పాత అభివృద్ధి , సంక్షేమ పథకాలకు కేటాయింపులను పెంచుతూ , కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. నిధుల సమీకరణకు అప్పుల బాట పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం రూ .2,30,825.96 కోట్లతో 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ .1,69,383.44 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.29,046.77 కోట్లుగా ప్రతిపాదించింది . కాగా రెవెన్యూ మిగులును రూ .6,7 43.50 కోట్లుగా చూపించినప్పటికీ ద్రవ్యలోటును రూ .45,509.60 కోట్ల అంచనా వేసింది. దీనిని పూడ్చుకునేందుకు రూ .49,300 కోట్ల రుణాలను తీసుకునేందుకు ప్రతిపాదించింది.
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు గురువారం నాడు శాసనసభలో 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి సుదీర్ఘంగా సుమారు 96 నిమిషాల పాటు 84 పేజీల బడ్జెట్ ప్రసంగాన్ని హరీశ్ రావు సభలో చేశారు. ఏడేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం ఏడు పదుల వయసున్న రాష్ట్రాలతో పోటీపడుతూ అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని ఆయన చెప్పారు. కాగా అదే సమయంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో భాగంగా షెడ్యూల్ కూలాల సర్వముఖా భివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక ఏడాది నుంచి “ సిఎం దళిత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం ” ను ప్రవేశపెట్టింది. ఈ పథకానికి బడ్జెట్లో రూ .1000 కోట్లను ప్రతిపాదించింది. త్వరలోనే రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇందుకు వచ్చే బడ్జెట్లో రూ .5,225 కోట్లను ప్రతిపాదించింది. రాష్ట్రంలో విద్యా రంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా ఉన్నతీకరిస్తూ రూ .4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించారు .
రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టబోతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆర్టీసికి మొత్తం రూ .3 వేల కోట్లను ప్రతిపాదించింది. ఇందులో బడ్జెటేతర నిధుల కింద రూ .1500 కోట్లు ఉన్నాయి. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర జిఎడిపి వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నదని ప్రభుత్వం తెలిపింది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వృద్ధి రేటు మైనస్ 3.8 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ 1.3 శాతంగా ఉన్నది. డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వే చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు బడ్జెట్ లో రూ .400 కోట్లను ప్రతిపాదించింది. ఈ విధానం వల్ల రికార్డుల వక్రీకరణకు ఎంత మాత్రం అవకాశం ఉండబో దని, వ్యవసాయ భూముల హద్దులతో పాటు దేవాలయ , వక్ఫ్, అటవీ ఇతర భూముల హద్దుల వివాదాలు , కూడా పరిష్కారం అవుతాయని మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో నాయి బ్రాహ్మణులు ఆధునిక సెలూన్లను ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇందులో భాగంగా రజకులకు అధునాతన వసతులతో దోబీ ఘాట్లను నిర్మించనుంది. గీత కార్మికుల సంక్షేమం కోసం నీరా పాలసీని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, దీనికి బడ్జెట్ లో రూ .25 కోట్లు ప్రతిపాదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో గొల్లకుర్మలకు రూ.3 వేల కోట్లతో మూడు లక్షల యూనిట్లను అందించాలని నిర్ణయించింది .
నేతన్నల సంక్షేమానికి రూ .338 కోట్లు ప్రతిపాదించింది. సొంత స్థలం కలిగిన పేదలకు రెండు పడకల గదుల గృహం నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని గత బడ్జెట్ లో పొందుపర్చినప్పటికీ కరోనా ఆర్థిక సంక్షోబం కారణంగా అమలు వాయిదా పడిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ హామీని అమలు చేయనున్నామని, ఇందుకు సంబంధించి విధి విధానాలను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఎంఎల్ఎ , ఎంఎల్‌సిల నియోజకర్గ అభివృద్ధికి రూ .5 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బడ్జెట్లో రూ .800 కోట్లను ప్రతిపాదించారు . నూతన సచివాలయ నిర్మాణానికి రూ .610 కోట్లను ప్రతిపాదించారు .
