IND vs ENG 3rd Test: అత్యల్ప స్కోరుకే చేతులెత్తేసిన భారత్… ఘోరంగా విఫలమైన టాప్ ఆర్డర్…
1 min read
3rd Test Ind Vs Eng, All out for 78 runs
చెత్త రికార్డు నమోదు చేసుకున్న భారత్…
నిన్నటి నుండి హెడింగ్లీ ప్రారంభమైన భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మొదటి రోజు టీమ్ ఇండియా ఘోరంగా విఫలమైంది. ఎవరూ ఉహించని విధంగా 78 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో టెస్టులో విజయం తో మూడో టెస్టు బరిలోకి దిగిన భారత్ ఆది నుంచే తడబడింది. ముఖ్యంగా రెండు టెస్టుల్లో నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్ ఈ టెస్టులో స్కోరు ఏమీ చేయకుండానే పెవీలియన్ బాట పట్టాడు. ఎప్పటి లాగే చేతేశ్వర్ పూజార 1 పరుగుకే అవుటవ్వడంతో భారత్ 4 /2 స్కోరుతో ఇబ్బందిలో పడింది.
తరువాత వచ్చిన కెప్టైన్ విరాట్ కోహ్లి పై ఆశలు పెట్టుకున్న భారత్ కి నిరాశే ఎదురైందని చెప్పాలి. 17 బంతులు ఆడిన కోహ్లి 7 పరుగులకు వెనుదిరిగాడు. భారత్ 23 పరుగులకే ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లను కోల్పోయింది. దీనితో రోహిత్ శర్మ, రహనే వికెట్ పడకుండా నెమ్మదిగా ఆడటానికి ప్రయత్నం చేసారు. కానీ ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక రహనే, పంత్, రోహిత్ శర్మ తక్కువ వ్యవధిలోనే ముగ్గురు అవుటవడంతో 67/6 స్కోరుతో భారత్ కష్టాల్లో పడింది. 67 పరుగుల వద్ద భారత్ మరో మూడు వికెట్లు షమీ, జడేజా,బుమ్రా వికెట్లను కోల్పోయింది. ఇంకొక 11 పరుగులు జోడించిన భారత్ 78 పరుగుల వద్ద సిరాజ్ అవుటవడంతో భారత్ 78 పరుగుల అత్యల్ప స్కోరు వద్ద ఆలౌట్ అయ్యింది.
మొదటి ఇన్నిగ్స్ లో భారత్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ (19), రహనే (18) చేసిన పరుగులే అత్యధిక పరుగులు. చివరిగా వచ్చిన ఇషాంత్ శర్మ ఒక బౌండరీ తో 8 పరుగులు సాధించడం విశేషం.
ఇంగ్లాండ్ బౌలర్లు భారత ఆటగాళ్ళ పై విరుచుక పడ్డారు. జేమ్స్ అండర్సన్, క్రైగ్ ఒవర్టన్ చెరో మూడు వికెట్లు తీయగా రాబిన్సన్, కర్రన్ చెరో 2 వికెట్లు తీసారు.
తరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇంగ్లాండ్ వికెట్ నష్ట పోకుండా 120 పరుగులు చేసి 42 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇది భారత్ కి చెత్త రికార్డుల్లో ఒకటిగా నిలిచింది. 1974 లో లార్డ్స్ మైదానంలో టీమ్ ఇండియా అత్యల్ప స్కోరుగా 42 పరుగులు నమోదైంది. 1952 లో మాంచెస్టర్ లో భారత్ 52 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టెస్టులో చేసిన 78 పరుగుల అత్యల్ప స్కోరు భారత్ పేరిట తొమ్మిదవ అత్యల్ప స్కోరుగా నమోదైంది.
ఇంగ్లాడ్ లో 200 కంటే తక్కువ స్కోరు చేసిన భారత్ జట్టు ఇప్పటి వరకూ ఎన్నడూ గెలవలేదు.
