వెనక్కి తగ్గని మోడీ, ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
1 min read
1611836481 Modi
మూడు వ్యవసాయ చట్టాలపై ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే చర్చ జరిపి తీరాలని సిపిఐ , సిపిఎం , టిఎంసి , కాంగ్రెస్ సహాపలు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం సంప్రదాయం మేరకు నిర్వహించే అఖిలపక్ష సమావేశం శనివారం జరిగింది. దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన ఈ సమావేశంలో అన్ని ప్రధాన ప్రతిపక్షాలు కూడా బడ్జెట్ సమావేశాల్లో రైతులకు సంబంధించిన అంశాలపై చర్చ జరగాల్సిందేనని కోరాయి. గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట దగ్గర జరిగిన హింస, విధ్వంసకాండను ముక్త కంఠంతో ఖండించాయి. అయితే, ఇంకా శాంతియుతంగా నిరసన చేస్తున్న ఇతర రైతులను సంఘటనకు బాధ్యులను చేయవద్దని విపక్షాలు స్పష్టం చేశాయ.
గతేడాది సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా వేలాది మంది రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త చట్టాలు కనీస మద్దతు ధర, మండీ వ్యవస్థకు గండికొడతాయని, తమను బడా కార్పొరేట్ల దయకు వదిలేస్తాయని రైతులు ఆందోళన బాట పట్టారు. వామపక్షాలతో పాటు పలు రాజకీయ పార్టీలు రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. కాగా కొత్త సాగు చట్టాలు రైతుల ఆదాయం పెంచడం దిశగా తీసు కున్న భారీ సంస్కరణలని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రభుత్వానికి , రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టం భన తొలగించేందుకు 11 విడత చర్చలు జరిగాయి. అయితే ప్రభుత్వం చట్టాల రద్దుకు ససేమిరా అనడం, రైతులు వాటి రద్దుకే పట్టుపట్టారు . చివరి విడత చర్చల్లో ప్రభుత్వం రైతు చట్టాలను ఏడాది న్నర కాలంపాటు నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల ముందు ప్రతిపాదన ఉంచింది. అయినప్పటికీ రైతు నాయకులు చట్టాల రద్దు డిమాండ్ కే కట్టుబడి ఉన్నారు . ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం నాడు రైతులు నిర్వహించిన ‘ ట్రాక్టర్ పరేడ్ ‘ కార్యక్రమం ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. కాగా , రైతుల అంశాన్నే ప్రధానంగా పేర్కొంటూ, వామపక్షాలుసహా 18 పార్టీలు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేసిన ప్రసంగాన్ని బహిష్కరించాయి. ఇలా వుంటే, శనివారం నాడు వివిధ రాజకీయ పార్టీల సభాపక్ష నాయకులతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వ్యవసాయ చట్టాల విషయంలో ప్రభుత్వం, నిరసన చేస్తున్న రైతుల ముందుంచిన ప్రతిపాదనకు ఇప్పటికీ కట్టుబడి ఉందని, ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ పిలుపు దూరం లోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశం సాఫీగా సాగేందుకు గాను ప్రభుత్వం సంప్రదాయం మేరకు నిర్వహించే అఖిల పక్ష సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన “ దురదృష్టకరమైన సంఘటన ” గురించి విపక్షాలు చేసిన ప్రస్తావనలకు ప్రధానమంత్రి “ చట్టం తనపని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా దీనికి హాజరయ్యారు. రైతుల అంశంపై కేంద్రం విశాల హృదయంతో వ్యవహరిస్తోందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. చివరి విడత చర్చలు జరిగిన జనవరి 22 నాటి మాటకే కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలిపారని జోషీ పేర్కొన్నారు.
రైతులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో రైతు చట్టాలపై వ్యవసాయ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉందని, రైతులకు ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ పిలుపు దూరంలోనే ఉందని నరేంద్ర సింగ్ తోమర్ చెప్పిన దానినే మోడీ పునరుద్ఘాటించారని ప్రహ్లాద్ జోషీ తెలిపారు. ఇక పార్లమెంట్ సమావేశాలు సాఫీగా జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన మోడీ, చర్చలకు అంతరాయం ఏర్పడటం వల్ల ప్రశ్నలు వేసే అవకాశం రాకపోవడంతో చాలావరకు చిన్న పార్టీలే నష్టపోతాయన్నారు మోడీ. అందుకని పార్లమెంట్ విధులు సవ్యంగా సాగేందుకు ప్రధాన పార్టీలు హామీ ఇవ్వాలని, అప్పుడే అవాంతరాలు ఉండవని, అలా చిన్న పార్టీలకూ తమ గొంతు విప్పే అవకాశం వస్తుందని మోడీ వ్యాఖ్యానించారని ప్రహ్లాద్ జోషీ తెలిపారు. శాసన వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వ ఎజెండాను రాజకీయ పక్షాల ముందుంచేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు సమావేశాల్లో తాము లేవనెత్తే అంశాలను అఖిలపక్ష సమావేశంలో పేర్కొంటారు.
కాలిఫోర్నియాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రధానమంత్రి ఖండించారని జోషీ వెల్లడించారు . అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాం నబీ ఆజాద్, తృణమూల్ ఎంపి సుదీప్ బంద్యోపాధ్యాయ , శిరోమణి అకాలీ దళ్ తరఫున బల్వీందర్ సింగ్ భుందేర్, శివసేనకు చెందిన వినాయక్ రౌత్ తదితరులు నిరసన చేస్తున్న రైతుల అంశాన్ని లేవనెత్తారని సమాచారం. ఇదిలా ఉంటే బడ్జెట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని బిజూ జనతా దళ్ ( బిజెడి ) డిమాండ్ చేసింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతిచ్చాయి. ఇక ప్రభుత్వం మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ శనివారం విజ్ఞప్తి చేసింది. అయితే రైతు సమస్యలపై చర్చ కోసం ప్రధానమంత్రి తప్ప కుండా ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తృణమూల్ ఎంపి సుదీప్ బంద్యోపా ధ్యాయ పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రపతి ప్రసంగాన్ని 20 విపక్షాలు బహిష్కరించడమే వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ప్రభుత్వానికి బలమైన సందేశమని టిఎంసి ఎంపి సుదీప్ బంద్యోపాధ్యాయ పేర్కొన్నారని సమాచారం .
