శ్రీరంగ దర్శనం-Know about Sri Ranganatha Swamy Temple, Srirangam
1 min read
శ్రీరంగనాధు



శ్రీరంగ మంగళనిధిం కరుణానివాసం|శ్రీ వేంకటాద్రి శిఖరాలయ కాలమేఘం|
శ్రీ హస్తి శైల శిఖరోజ్వల పారిజాతం| శ్రీశన్నమామి శిరసాయదుశైలదీపం|
తిరువరంగం, శ్రీరంగం, 108 వైష్ణవ దివ్యదేశాలలో ముఖ్యమైనది, మొట్టమొదటిది. ఇది స్వయంవ్యక్త క్షేత్రం. మూలమూర్తి శ్రీరంగనాథుడు, ఉత్సవమూర్తి నంబెరుమాన్. పరాశర భట్టర్ నిజమైన శ్రీరంగ వైభవాన్ని తిలకించినట్లు, శ్రీరంగంలో ఎన్నో మేలిమి బంగారు, ముత్యాలు, రత్నాలు పొదగబడిన ఆభరణాలు, మరెంతో విలువైనవిలువైన వజ్రాలు, మొదలగు ఎంతో సంపద ఉండేదనీ, ఆ సంపదనంత కూడా ముస్లిం రాజులు దోచుకొనిపోయారని చరిత్ర. ప్రాచీన కాలంలోని ఎంతోమంది రాజులు ఎనలేని బంగారు ఆభరణాలను, వజ్ర వైడూర్యాలను దేవాలయాలు మరియు పెరుమాండ్ల అలంకారానికి కూడా ఉపయోగించేవారనీ, రంగనాథుని కండ్లకు ఒక ప్రత్యేకమైన వజ్రాలు అమరిస్తే నిజమైన కండ్లలాగా కనబడేవట. ముస్లిమ్ రాజుల సేనలు యుద్ధం చేసి శ్రీరంగనాథుని సంపదను దోచుకోవటానికి వచ్చిన సందర్భంలో పూర్తిగా మేలిమి బంగారంతో ఉన్న శ్రీరంగనాధుని ఉత్సవమూర్తి నంబెరుమాన్ విగ్రహాన్ని దోచుకోకుండా శ్రీపిళ్ళలోకాచార్యులవారు రంగనాథుని విగ్రహాన్ని కాపాడుకోవటానికి మధురకు తీసుకొని వెళ్ళేప్రయత్నం చేశారనీ, ఈ విగ్రహంకోసం దేవాలయ కమిటీవారిని హింసించి హతమార్చారనీ, ఆచార్యులు మధురకు చేరుకొనేవరకు ఇక్కడి రంగనాథుని భక్తురాలు, దేవదాసి అయిన “వెళ్ళై అమ్మాళ్” అనే నర్తకి సౌన్దర్యానికి ముగ్ధుడైన ఆర్మీ చీఫ్ విగ్రహంగురించి అడగగా చూపిస్తానని చెప్పి తన నాట్యంతో సంతోషపరుస్తూ ఒక గోపురంపై వరకు తీసుకెళ్ళి విమానం చూపించి వెనకనుండి త్రోసివేసిందట. చీఫ్ మరణంతో సైన్యం భయపడి శ్రీరంగం వదిలి వెళ్ళారట. అంతేకాకుండా ఒక మనిషిని హత్యచేయడం దోషం కనక ఆ నర్తకి కూడా గోపురం పైనుండి దూకి ఆత్మహత్యచేసుకున్నదనీ, శ్రీరంగపెరుమాళ్ళను కాపాడుకోవటం కోసం ఆత్మార్పణ చేసిన ” వెళ్ళై అమ్మాళ్”కు గుర్తుగా ఈ గోపురానికి కేవలం తెల్లరంగు మాత్రమే వేయటం ఇప్పటికీ జరుగుతున్నది. తమిళభాషలో వెళ్ళై అనగా తెలుపు అని అర్ధమట. ప్రతిమనిషి జీవితంలో ఒకసారైనా శ్రీరంగ దర్శనం చేసుకోవాల్సిందే.
ఉభయకావేరీ మధ్యలో నెలకొన్న శ్రీరంగం, భూలోక వైకుంఠం. కావేరీ నది రెండు పాయలుగా చీలడంతో ఒక పాయను కొల్లిడామ్ గానూ, మరొకపాయ కావేరిగాను పిలుస్తారు. ఇది త్రిచి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో కావేరీనది ఒడ్డున ఉన్నది. నది ఒడ్డున వినాయకుడి ఆలయం, అందులోనే నవగ్రహమందిరం. కండ్లు చెదిరిపోయే సప్తప్రాకారాలు. అచ్యుతదేవరాయలు నిర్మించిన 236 అడుగులు 192 అడుగుల వెడల్పు 13 అంతస్తులు గల అద్భుత మహాగోపురం.
మొదటి గోపురం క్రిందిభాగంలో భక్తులకు అభయమివ్వడానికి సిద్ధంగా ఆంజనేయ, గరుడాళ్వారు సన్నిధులు, ఇదేప్రాంగణంలో కొలువై ఉన్న ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకొని భక్తులు తరువాత ప్రాకారానికి చేరుకోవాలి. శ్రీరంగనాధస్వామి దర్శనభాగ్యం కలగగానే మరోప్రాంగణంలో ఉన్న రంగవల్లి అమ్మవారిని దర్శించుకొని తరిస్తారు. ఈ ఆలయాన్ని శ్రీరంగ నాచియార్ కోవెలగా, తాయార్ సన్నిధిగా, శ్రీరంగ నాయికమందిరంగా పిలుస్తుంటారు. ఈ ఆలయానికి సమీపంలోనే భక్తులను కటాక్షించడానికి నరసింహస్వామి సన్నిధి ఉన్నది.
శ్రీరంగంలో నిర్మింపబడిన ఉపాలయాలలో సుదర్శన చక్రత్తాళ్వార్ సన్నిధి భక్తులను ఆకర్షిస్తుంది. ఇక్కడి సుదర్శనస్వామి భక్తరక్షకుడే. అయితే వెనుకభాగంలో చతుర్భుజాలతో చక్రాన్ని ధరించిన ఉగ్ర నారసింహస్వామి ఉండడం విశేషం. పదిమంది ఆళ్వార్లు కీర్తించిన శ్రీరంగం, రంగనాధప్పెరుమాళ్, రంగనాయకిత్తాయార్, పెరియ కోవిల, పెరియ పెరుమాళ్, పెరియ పిరాట్టియార్, అధ్యయనోత్సవం, వైకుంఠ ఏకాదశి పెరియ తిరుణాళ్ళు. “పెరియ” అన్న తమిళ పదానికి అర్థం గొప్ప అని. స్వర్ణప్రకాశిత ప్రణవాకార విమానం, చంద్ర పుష్కరిణి, ఇలా శ్రీరంగం గురించి ఎంత పరిశీలించినా అంతులేని విషిష్ఠత, అపూర్వ శిల్పకళాఖండాలు, ఆకాశమంత ఎత్తైన గోపురాలు,ద్వారాలు, గోపురాలపైన మరియు రాతి స్తంబాలు గోడలపై కూడా ఎటు చూసినా అద్భుతమైన చారిత్రక, పౌరాణిక గాధలను తెలియపరిచే సుందరమైన శిల్పాలు,బొమ్మలు,చిత్రాలు, అద్భుత కళా ఖండాలు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పి ఎటువంటివారినైనా భక్తి ప్రపత్తులవైపు నడిపిస్తూ వైకుంఠాన్ని ప్రత్యక్షంగా చూపించే శ్రీరంగం తిరువరంగం.
శ్రీరంగ చరిత్రలో ఒక పౌరాణిక కథ ఉన్నది. ఒకనాడు బ్రహ్మదేవుడు పాలకడలిలో శేషతల్పమున శయనించే శ్రీహరిని అర్చించాలని కోరుకోగా శ్రీహరి అనుగ్రహించి శ్రీరంగవిమానంలో శయనరూపంలో దివ్య విగ్రహంగా అందిరాగా బ్రహ్మదేవుడు ప్రతిరోజు అర్చిస్తుండగా, వైవస్వత మనువు యొక్క పుతృడు ఇక్ష్వాకుమహారాజు తన తపస్సు చేత బ్రహ్మను మెప్పీంచి శ్రీహరి శయనించి ఉన్న శ్రీరంగవిమానాన్ని పొందాడు. దయామయుడు, భక్తసులభుడు అయిన శ్రీరామచంద్రుడు ఆ విమానాన్ని విభీషణునికి ఇచ్చాడు. ఎట్టి పరిస్థితిలోనూ విమానాన్ని క్రింద పెట్టగూడదని కూడా చెప్పాడట. విభీషణుడు ఆ విమానాన్ని తీసుకొని లంకకు వెళ్ళుచుండగా మధ్యలో శ్రీరంగద్వీపం(కావేరీ) లో స్నాన సంధ్యావందనాది క్రతువులు నిర్వహించుకోవటానికి ఎవరైనా ఈ విమానాన్ని భరించి పట్టుకోగలవారున్నారా అని ఆలోచిస్తుండగా దేవతలందరు వినాయకుడిని మారువేషములో పంపగా విమానాన్ని పట్టుకుంటానని చెప్పి భరించలోకపోతున్నానని కావేరీనది ఒడ్డున భూమిపై పెట్టాడట. అప్పుడు విభీషణుడు మారువేశంలో ఉన్న వినాయకుడిపై ఆగ్రహించగా పారిపోయాడట. ఎంత ప్రయత్నించినా ఆ విమానాన్ని పైకి ఎత్తలేకపోయాడట. అప్పుడు విష్ణువు నాకు ఈస్థలం బాగా నచ్చింది. ఇక్కడే ఉండి భక్తజనోద్ధరణ చేస్తూ నిన్ను కూడా ఇక్కడే ఉండి అనుగ్రహిస్తాను వెళ్ళమన్నాడట. అప్పుడు విభీషణుడు లంకకు వెళ్ళిపోయాడట. నా వచ్చే పోస్ట్ లో 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో శ్రీరంగం సమీపములో ఉన్న కొన్ని ప్రాచీన ఆలయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
