బతుకమ్మ పండుగ – విశిష్టత (Know about Batukamma Festival)
1 min read
బతుకమ్మ పండుగ
పెత్ర అమావాస్య – విశిష్టత
పితృ దేవతా ప్రియం – మహాలయం
భాద్రపద మాసంలో పూర్ణిమ తరువాత పదిహేను రోజులను మహాలయ పక్షంగా వ్యవహరిస్తారు. ఈ పదిహేను రోజుల్లో తిథుల అనుసారంగా పితృదేవతలను తలుస్తూ శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. వీటినే పితృ పక్షాలుగా వ్యవహరిస్తారు. సంవత్సరానికొకసారి మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించినప్పటికి, మహాలయ పక్షంలో చేసే కర్మలు అత్యంత పుణ్యమని శాస్త్రంలో చెప్పబడింది.
ఈ పెత్ర అమావాస్య రోజున చేసే పితృ దేవతా కార్యంతో కాలం చేసిన తల్లి తడ్రులు,వారితో పాటుగా వంశంలోని వారందరికీ శ్రాద్ధ ఫలం కలుగును.
మొదటి 14 రోజులు వీలు కాక పొతే మహాలయ అమావాస్య రోజున తప్పనిసరిగా పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు జరపాలి. దీన్ని తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల్లో దీనిని పెద్దలకు బియ్యం పండుగ అని కూడా అంటారు.
బతుకమ్మ పండుగ విశిష్టత
శరన్నవరాత్రులు సమస్త ప్రజానీకం చేయలేరని, పేద, ధనిక అనే తేడా లేకుండా, సమస్త ప్రజానీకం ఆరాధించుటకు అనుకూలంగా తొమ్మిది రోజులు ఆచరించుటకు త్రిలింగ దేశ నాయకులు, రాష్ట్ర కూటములు, కాకతీయులు తెలంగాణ ప్రాంతమున ఈ పండుగను ఆచరించుటకు పునాది వేసినారని విద్యానాధుని గ్రంథాల ద్వారా తెలుస్తున్నది.
ఈ పండుగ కేవలం తెలంగాణ ప్రాంతం వారి సొంతం అని చెప్పొచ్చు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల వారసత్వ పండుగగా చెప్పొచ్చు. ఇది ఒక పండుగానే కాదు, దీనికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర నుండే ఈ పండుగ పుట్టిందని చెప్పొచ్చు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ఈ పండుగ.
ఒక పెద్ద పళ్ళెం లో శ్రీ చక్రం లాగా పేర్చి, ప్రకృతిలో దొరికే అన్ని రకాల పూలతో త్రికోనాకారంలో ఈ బతుకమ్మను తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బతుకమ్మను తంగేడి పూలు, గునుగు పూలు, టేకు పూలు, కట్ల పూలు, అలాగే మనకు అందుబాటులో ఉన్న పూలతో అలంకరించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రకృతి మాతకు గౌరవమిస్తారు.

ప్రథమంగా మూడు, ఐదు, తొమ్మది, పదకొండు, పదమూడు, పదిహేను రోజులు మట్టిలో శ్రీ చక్రమును పీటమీద ఏర్పాటు చేసి ప్రతి అంతరంలో పూలతో అలంకరించి ధూప దీపాది నైవేద్యములు అర్పించి, కన్నె పిల్లలు చక్కటి ఆధ్యాత్మిక, భక్తి పాటలు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాడుకుంటూ బతుకమ్మని పూజించుకొంటారు. దీనిని బొడ్డెమ్మగా పిలుచుకుంటారు. రేపు పితృ అమావాస్య అనగా ఈ బొడ్డెమ్మను కన్నెపిల్లలు ఆడుకొని అమ్మవారి అనుగ్రహం పొందుతారు. బతుకమ్మ పాటలు వేల సంఖ్యల్లో ఉన్నాయి. ఈ పాటలు కొన్ని తెలంగాణ చరిత్రను తెలియజేస్తే, కొన్ని బతుకమ్మని పూజించేవిగా ఉంటాయి. ఈ పాటలకు తగ్గట్టు చప్పట్లు కొడుతూ, కాళ్ళు కదుపుతూ, కోలాటమాడుతూ బతుకమ్మని పుజించుకుంటారు.

ఇలా వారి వారి సంప్రదాయాల ప్రకారం గ్రామం లోని మహిళలు అందరూ కలసి ఐకమత్యంగా పాటలుపాడుతూ, కోలాట మాడుతూ బతుకమ్మని పూజించి, వైభవంగా గ్రామం లోని చెరువులో కానీ, నదిలో కానీ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇలా 3, 5, 7, 9 11, 13, 15 రోజులు వారి గ్రామ పెద్దలు, పూర్వ ఆచారం ప్రకారం బతుకమ్మని పూజించుకుంటారు.
ఇక్కడ చెప్పుకోవసింది ఏంటంటే, ఈ పండుగ పూజా విధానమును, ఆది, అంతములు,తిథి, వారములు, ఎవ్వరూ, ఎక్కడ చెప్పబడలేదు. బాద్రపద బహుళ అమావాస్య మొదలుకొని 9 రోజులు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.
ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మ అని , తొమ్మిదవ రోజును సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు.
బతుకమ్మ నైవేద్యములు
- ఎంగిలి పువ్వు బతుకమ్మ – నువ్వులు, నూకలు, బెల్లం
- అటుకుల బతుకమ్మ – అటుకులు,బెల్లం, చప్పిడి పప్పు
- ముద్దపప్పు బతుకమ్మ – ముద్దపప్పు ,పాలు, బెల్లం
- నానే బియ్యం బతుకమ్మ – పాలు, బెల్లం, నానా బెట్టిన బియ్యం
- అట్ల బతుకమ్మ – బియ్యపు పిండి అట్లు
- అలిగిన బతుకమ్మ – ఈ రోజు నైవేద్యం సమర్పించరు.
- వేపకాయ బతుకమ్మ –బియ్యపు పిండితో వేపకాయల రూపంలో వంటకం.
- వెన్నముద్ద బతుకమ్మ – నువ్వులు, బెల్లం, నెయ్యి / వెన్న.
- సద్దుల బతుకమ్మ – అయిదు రకాల సద్దులు ( చింతపండు పులిహోర, పెరుగు సద్ది, నిమ్మ సద్ది, కొబ్బరి సద్ది, నూల పొడి / అన్నం ).
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండుగను ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చెందించారని చెప్పొచ్చు.
