June 3, 2024

Digital Mixture

Information Portal

రంగులద్దిన పాట … Song from “UPPENA” Telugu Movie

1 min read
Uppena, Telugu movie, Lyricist, Telugu lyricist

Uppena Ranguloddi Song, youtube / Aditya Music

అప్పుడప్పుడే ప్రేమ పురుడు పోసుకుంటున్న ఓ జంట లోకం కంటపడకుండా ఎలా వారి ప్రేమాయణం సాగించాలో, ప్రకృతికి సైతం తమ ప్రేమ గుట్టు తెలియకుండా ఏకాంతం కోసం రహస్య ప్రణయ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారన్న తీరును గమ్మత్తుగా వివరిస్తూ ఉప్పెన సినిమా లో దేవిశ్రీ బాణీకి, శ్రీమణి నేర్పుగా కూర్చిన పదాలు యాజీన్ నిజార్, హరిప్రియ గొంతులో రూపుదిద్దుకున్న ఈ పాట రంగులద్దుకున్న అంటూ కవి కలం కదిలిన విధానం నిజంగా శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

పల్లవి:

రంగులద్దుకున్నా తెల్ల రంగులవుదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లేవుందాం
ఆకు చాటునున్న పచ్చిపిందలవుదాం
మట్టిలోపలున్న జంట వేరులవుదాం
ఎవ్వరీ కంటిచూపు చేరలేని…ఎక్కడా మన జంట ఊసురాని..
చోటున పద నువ్వు నేనుందాం….

మొదటగా పల్లవిలో రంగులద్దుకున్న తెల్ల రంగులవుదాం అంటే అన్ని రంగుల్లో వీళ్ళు తెల్ల రంగుల్లామారి చూసే వారి  దృష్టి మిగతా రంగుల్లో కి మరల్చుతూ దాచుకుందాం అని వీరి భావన. రెండో పాదంలో పూలు కప్పుకున్న కొమ్మలల్లేవుందాం అంటూ మరోసారి రంగులమాటున దాక్కున్నారు. ఇంకోసారి ఆకులు కప్పుకున్న పచ్చిపిందల్లా మారుతారు. అలాగే ఇంకొంచెం లోతుగా వెళ్లి మట్టిలో దాగిన జంటవేరులవుతారు. ఇలా ఎవ్వరి కంటపడకుండా అసలు వాళ్ళ ఊసేలేని చోటకు వెళదాం అంటారు.

చరణం 1:

తేనెపట్టు లోన తీపిగుట్టు ఉందిలే…
మన జట్టులోనా ప్రేమ గుట్టుగుందిలే..
వలలు తప్పించుకెల్లు.. మీనాల వైనాల
కొంటె కోణాలు తెలుసుకుందాం..
లోకాలా చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో
కొత్త పాఠాలు నేర్చుకుందాం…
అందరూ ఉన్న చోట ఇద్దరవుదాం..ఎవ్వరూ లేని చోట ఒక్కటవుదాం..
 ఏ క్షణం విడి విడిగా లేమందాం…

మొదటి చరణం లో కవి రంగుల్లో నుండి రుచుల్లోకి వచ్చి తేనెపట్టులోనున్న తీపి గుట్టుని తన పదాల అల్లిక  ద్వారా వింటున్న శ్రోతలకు పంచుతాడు. అదేవిధంగా వలల్లో పడి తప్పించుకెళ్లే  చేపలను చూసి ఆ ప్రేమికులు మనం ఇంకా ఎలా కొత్తగా తప్పించుకెళ్ళాలో అనే కొత్త కోణాన్ని నేర్చుకుందాం అంటారు.

మళ్ళీ ఇక్కడ కవి తన కొంటె తనాన్ని చూపుతూ.. అందరూ చూస్తున్నప్పుడు వేరుగా ఉంటూ, ఎవ్వరూ లేనప్పుడు ఒక్కటవుతూ, క్షణం కూడా విడిగా ఉండొద్దు అని అనుకుంటున్నారు అంటాడు.

చరణం 2:

మన ఊసు మోసే గాలిని మూట కడదాం
మన జాడ తెలిపే నేలను పాతిపెడదాం
చూస్తున్న సూర్యుణ్ణి తెచ్చి .. లాంతర్లో దీపాన్ని చేసి
చూరుకెలాడదీద్దాం..
సాక్ష్యంగా సంద్రాలు ఉంటే.. దిగుడు బావిలో దాచి మూత పెడదాం..
నేనిలా నీతో ఉండడం కోసం చేయనీ ఈ చిన్నపాటి మోసం
నేరమేం కాదే.. ఇది మన కోసం..

రెండవ చరణంలో కాస్తంత గాఢత పెంచి రచయిత ఊహా శక్తిని కూడా అంచనావేయలేని విధంగా తను తీసుకున్న ఉపమానాలు ఉంటాయి. కొత్తగా ప్రేమలో పడిన జంటకు ఏదీ అతిశయోక్తి కాదు అన్నట్లు ఆ పదాలతో ప్రకృతిని సైతం బంధిస్తాడు. వారి మాటల్ని మోసే గాలిని మూట కట్టేస్తారు. వారు వెళ్ళే జాడ తెలిపే ఆ నేలను సైతం పాతిపెడదాం అంటూ చెప్పిన విధం పాటకుని ప్రతిభ  నిజంగా అభినందనీయం. చూసే సూర్యుణ్ణి కూడా లాంతరులో దీపాన్ని చేసి గుడిసెలో చూరుకు వేలాడదీస్తారట. ఇంకా వీళ్ళకి సాక్ష్యంగా ఉండకుండా సముద్రాన్ని కూడా దిగుడు బావిలోకి తీసుకెళ్ళి మూత పెట్టేద్దాం అంటారు.

చివరికి తప్పేమో అన్న భావనకు వచ్చినట్టే వచ్చి, మళ్ళీ అయినాసరే నేను నీతో ఉండడం కోసం చిన్నపాటి మోసం నేరం కాదంటూ, పైగా ఇదంతా మన కోసమే అంటూ చక్కని ప్రాసతో సర్దిచెప్పుకుంటారు.

రాయిలోన శిల్పం దాగి ఉండునంటా…
శిల్పి ఎదురైతే బయటపడునంటా…
అద్దమెక్కడున్నా ఆ వైపు వేళ్ళకంటా…
నీలో ఉన్న నేనే బయటపడిపోతా
పాలలో ఉన్న నీటి బొట్టులాగా…
నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా ..
నేనిలా నీ లోపల దాక్కుంటా…

చివరగా ప్రియుని అంతరంగం లోని మాటను తన ప్రేయసికి తెలియజేయడానికి రాయిలోని శిల్పాన్ని ఉదహరిస్తూ నేను కూడా నీలో రాయిలో శిల్పంలా దాక్కుని ఉన్నానన్న ఆలోచనకు అద్దం పట్టే విధంగా ప్రేయసిని అద్దం వైపుకు వెళ్లొద్దు అని, వెళితే నేనే బయటపడతా అంటాడు. ఇంకా దీనికి ముక్తాయింపునిస్తూ పాలల్లో కలిసిపోయిన నీటి బిందువుల్లా నీళ్లల్లో దాగిన మెట్టులాగ నీ లోపల నేను దాగి ఉన్నాను అంటాడు.

ఇక్కడ మరొకసారి దిగుడు బావిలో దాగిన మెట్టు వైపుకి రచయిత ఆలోచన మరలుతుంది. అందుకే మళ్ళీ నీళ్ళ లోపల మెట్టుగా అభివర్ణిస్తాడు. ఇలా పాట ఆద్యంతం ప్రకృతి తో ఆ ప్రేమ జంట దోబూచులాడిన తీరు శ్రోతలను అలరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *