తెలుగు సినిమాల్లో తెలంగాణ జానపదాల హవా…
1 min read
Telangana Folk Songs In Telugu Movies
ఒకప్పుడు సినిమాల్లో తెలంగాణ జానపదాలు అంటే అప్పట్లో నిజాంకు వ్యతిరేకంగా విప్లవాల నేపథ్యంలో తీసిన వీర తెలంగాణ సినిమాలో వచ్చిన “బండి ఎనక బండిగట్టి పదహారు బండ్లుగట్టి ఏ బండ్లో వస్తవు కొడుకో నైజామ్ సర్కరోడా” పాట. ఈ పాట అప్పట్లో చాలా జనాదరణ పొందింది . ఆ తరువాత ఎర్రమల్లెలు చిత్రంలో గీత రచయిత సాహితీ గారు రాసిన “నాంపల్లి స్టేషన్ కాడా రాజలింగో” మరియు “లాలూ దర్వాజ లష్కర్ బోనాల పండకు వస్తానని రాకపోతివి” అన్న తెలంగాణ జానపద గేయాలు కూడా చాలా విజయవంతమయ్యాయి. అదే విధంగా కాలేజీ సినిమాలో వచ్చిన ” మైసమ్మో మైసమ్మ మాయదారి మైసమ్మ నను గాబరా బెట్టి గాయబు గాకే మైసమ్మ “ పాట కూడా బాగానే పాపులర్ అయింది. దర్శకుడు ఎన్ శంకర్ ఎన్కౌంటర్ మూవీలో తానే స్వయంగా రాసిన “ఎనుకొచ్చే ఆవుల్లారా ఎర్ర ఆవుల్లారా “ అన్న పాట,ఆ తర్వాతి కాలంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో గాయకుడు గద్దర్ రాసి పాడిన “అమ్మా తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా” పాట ప్రజల్లో చైతన్యం నింపిందని చెప్పవచ్చు. తరువాత అడపా దడపా కొన్ని జానపద గీతాలు వచ్చినా అంతగా ప్రాచుర్యం సంతరించుకోలేదనే చెప్పాలి.
ఈ మధ్య కాలంలో సినిమాల్లో తెలంగాణ జానపదాలు సందడి చేస్తున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో తెలంగాణ పాటలు,మాటలు చాల అరుదుగా ఉండేవి. మహా అయితే ఒకటో రెండో ఉండేవి .ఒకవేళ సినిమాల్లో తెలంగాణా యాసను వాడిన కేవలం హాస్యము కోసమే అన్నట్లు ఉండేది.లేదంటే విలన్ పాత్రలకు మాత్రమే పరిమితమయ్యేది, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాలో ఆరు పాటలు ఉంటె ఆరు కూడా తెలంగాణ జానపదాలు ఉంటున్నాయంటే అతిశయోక్తికాదు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ జానపదాల శకం మొదలైందని చెప్పవచ్చు
మహాత్మా సినిమాలో “నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి” అన్న పాటతో వెండితెరకు పరిచయమైన గీతరచయిత కాసర్ల శ్యామ్.ఈ మధ్య ఈయన పాట లేనిదే సినిమాలు ఉండటం లేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.అల వైకుంఠపురంలో చిత్రంలో తెలంగాణ పల్లెల్లో సరదాగా అనుకునే ఉతపదం హుక్ లైన్ గా తీసుకుని “రాములో రాములా నా పానం తీసిందిరో” అంటూ రాసి తెలుగు సినిమాల్లో జానపద పాటల ట్రెండు తీసుకొచ్చారు.దాని తర్వాత దసరా మూవీ లో “చంకీల అంగీ వేసి ఓ వదిన చాకు లెక్క ఉండేటోడే “అని రాసిన సాంగ్ ఇప్పుడు పెద్ద హిట్. ఈ మధ్య వచ్చిన దసరా, బలగం మూవీల్లో అన్ని పాటలు ఈయనే రాయడం విశేషం. బలగం మూవీలో అన్ని జానపద పాటలే అందులో “బల రామ నర్సయ్యో బల రామ నర్సయ్యో” మరియు గాయకురాలు మంగ్లీ పాడిన “ఊరు ఊరు పల్లెటూరు” పాటలు మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది అని చెప్పవచ్చు.
దాసరి నారయణరావు గారి దర్శకత్వంలో సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ఒసేయ్ రాములమ్మ సినిమాలో అన్ని పాటలు కూడా తెలంగాణ జానపద నేపథ్యంలోనే సాగుతాయి.
అందులో “ఇంతి ఏ ఇంటి దానివే ” అదేవిధంగా “కడవ మీద కడవ పెట్టి కడిలెంచేనావమ్మ ఓ ఒసేయ్ రాములమ్మ” పాటలకు చాలా వరకు పేరొచ్చింది.ఆ తరువాత మళ్ళీ ఈ మధ్య కాలంలో సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ఫిదా సినిమాలో “వచ్చిండే వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే” పాట అదే శేఖర్ కమ్ముల ద్శకత్వంలో వచ్చిన లవ్ స్టొరీ మూవీలో కూడా “దాని కుడి భుజం మీద కడవ దాని కుత్తెపు రైకలు మెరియా దాని పేరే సారంగ దరియా” పాట చాలా పెద్ద హిట్ అయింది. ఈ పాట వివాదాన్ని కూడా మూటకట్టున్న విషయం తెలిసిందే.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో జానపద నేపథ్యముగల “ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే “ పాటను రాసిన రచయిత చంద్రబోస్ కూడా ప్రేక్షకుల మనసును చూరగొన్నాడు. అదేకాకుండా తెలంగాణ యాస లో “నాటు నాటు “ అంటూ తెలంగాణ మాస్ పదాలతో పాటను అల్లి దేశం గర్వించదగిన ఆస్కార్ అవార్డ్ సాధించాడు. ఇలా తెలుగు చిత్ర సీమలో ఈ జానపద గీతాల హవా ఇలాగే కొనసాగి శ్రోతల మనసులు రంజిపచేయాలని కోరుకుందాం.
