హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం…
1 min read
Hyderabad Road Accident
గచ్చిబౌలిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు .
పోలీసుల కథనం ప్రకారం … మాదాపూర్ లోని ఓ వసతిగృహంలో ఉంటున్న కాట్రగడ్డ సంతోష్ , భరద్వాజ్ , పవన్ , రోషన్, మనోహర్లు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కారులో గచ్చిబౌలి నుంచి గౌలిదొడ్డివైపు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అతి వేగంతో విప్రో సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ ని అధిగమించింది. ఈ క్రమంలో అటు నుంచి వచ్చిన టిప్పర్ కారును ఢీకొనడంతో రెండు వాహనాలు రోడ్డుపై పల్టీలు కొట్టాయి. కారు ఎగిరిపడటంతో రోడ్డు పక్కనే తాగునీటి కోసం ఏర్పాటు చేసిన షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. కారు నుజ్జునుజ్జవ్వగా , మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగి పడ్డాయి. మృతులంతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు .
అతివేగమే ప్రమాదానికి కారణమని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయిగూడెంకు చెందిన కాట్రగడ్డ సంతోష్ టెక్ మహీంద్రాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. మృతుల్లో మరొకరైన చింతా మనోహర్ తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లికి చెందిన యువకుడు కాగా , పవన్ కుమార్ నెల్లూరు జిల్లా వేదాయపాలెంనకు చెందిన వ్యక్తిగా గుర్తించారు . పప్పు భరద్వాజ్ -విజయవాడ అజిత్ సింగ్ నగరకు చెందిన వాసిగా పోలీసులు నిర్ధరించారు . నాగిశెట్టి రోషన్ స్వస్థలం నెల్లూరుగా గుర్తించారు .
కంటైనర్ … ద్విచక్రవాహనం ఢీ : ఇద్దరు మృతి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం రహదారులు నెత్తురోడాయి . వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు . కంటైనర్‌ను బైకు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన -సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో చోటు చేసుకుంది . ముత్తంగి జాతీయ రహదారిపై పిస్తా హౌస్ సమీపంలో కంటైనర్ వాహనం మలువు తిరుగుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన బైకు ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. మృతులు పటాన్ చెరు మండలం రుదరం గ్రామానికి చెందిన రాజు , ఆంజనేయులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు .
కూకట్‌పల్లిలో …. ఆదివారం తెల్లవారుజామున కూకట్‌పల్లిలో మరో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ప్రకాశ్ అనే యువకుడిని కూకట్‌పల్లి మెట్రో పిల్లర్ వద్ద వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి , కుమారుడు మృతి విద్యుత్ స్తంభాన్ని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో తల్లీకుమారుడు మృతిచెందారు. శంకర్‌పల్లి మండలం మోకీల సమీపంలో ఈ ప్రమాదం జరి గింది. అతివేగంతో వెళుతున్న బైకు వేగాన్ని నియంత్రించలేక రహదారికి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో శివయ్య ( 48 ), బుచ్చమ్మ (70 ) అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు శంకర్‌పల్లి మండలంలోని కొండకల్ చెందిన తల్లీ కుమారుడిగా గుర్తించారు . శివయ్య రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న ట్టు పోలీసులు తెలిపారు.
