తెలంగాణ లో ఇక 24/7 షాపులు, రెస్టారెంట్లు… ఆర్థిక వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉందా?
1 min read
24 Hours Shops Open In Telangana
రాత్రి పూట వ్యాపారాల అనుమతితో తెలంగాణ ఆర్థిక వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉందా…
తెలంగాణ లో ఇక 24 గంటలు షాపులు, రెస్టారెంట్లు తెరిచి ఉంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే సంవత్సరానికి రూ. 10,000 కట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలియజేసింది. ముఖ్యంగా ఇది హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. దీనితో ఇక హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో 24 గంటలపాటు షాపులు, రెస్టారెంట్లు తమ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. రోజు రోజు కు హైదరాబాద్ లో రాత్రి పూట పనిచేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఐటి రంగానికి చెందిన కంపనీలతో నిండిన హైదరాబాద్, రాత్రి పూట పనిచేసే అలవాటును తీసుకొచ్చింది. దీనికి అనుసందానంగా రాత్రి పూట మాత్రమే తెరిచి ఉంచే మొబైల్ ఫుడ్ కోర్ట్స్, కాబ్ సర్వీస్ ఇలా చాలా రకాలుగా హైదారాబాద్ లో వ్యాపారాలు, జాబ్స్ చేస్తున్నారు. అలాగే 24 గంటలు మన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఈ కల్చర్ ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు వాణిజ్య వ్యాపారాలు చేసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది అని చెప్పొచ్చు. దీనితో వ్యాపారులందరూ ఈ విధానాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదొక రకంగా హైదరాబాద్ లో ఉదయం, రాత్రి జాబ్ చేసుకొనే వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులు వారికి అనుకూల సమయంలో షాపింగ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రానికి రాత్రి పూట జరిగే వ్యాపారాల వల్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. హోటళ్ళు, రెస్టారెంట్లు 24 గంటలు తెరిచి ఉంచడంతో, రాత్రిపూట మాత్రమె తెరిచి ఉంచే మొబైల్ ఫుడ్ కోర్టుల ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.
ఈ విధానం వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్తకి కొంత పురోగతి లభించినా, ప్రభుత్వానికి కొన్ని సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అదే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
మొదటగా ఆడవాళ్ళకు రక్షణ కల్పించడం. ఇది ప్రధాన సమస్యగా చెప్పొచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 4 గంటల సమయం చాలా కీలకం అని చెప్పొచ్చు. హైవేల మీద కొంత వరకు ఇబ్బంది లేకున్నా, హైవేల నుండి లోపల గల్లీ లోకి వెళ్ళే వారికి రక్షణ ఎక్కువగా అవసరం. దీనికోసం పోలీసు యంత్రాంగం ఎప్పటికంటే ఎక్కువగా అలర్ట్ గా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ మంది పోలీసుల అవసరం ఉంటుంది.
అలాగే రాత్రిపూట ట్రాఫిక్ కి సంబంధించిన సమస్య తలెత్తే అవకాశం ఉంది. రాత్రిపూట జనాలు బయట ఎక్కువ మొత్తంలో వస్తే రాత్రి కూడా ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయాల్సి వస్తుంది.
రవాణా సౌకర్యం కూడా మరో ముఖ్యమైన అంశం. కానీ ఇప్పుడు రాత్రిపూట సొంత వాహనాలు లేనివారు తిరగాలంటే ఉదయం లాగా ప్రభుత్వ రవాణా సదుపాయం ఉండాల్సి వస్తుంది. లేదంటే ప్రైవేటు వాహనాలు దాన్ని అదునుగా చేసుసకొని ప్రజల దగ్గరనుండి అధిక చార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది.
అలాగే మద్యం దుకాణాలకు 24 గంటల అనుమతి ఉందా లేదా అనేది ఇంకా తెలియ రాలేదు. అలాగే ఇంకా వ్యాపారదారులు కొంత అయోమయంలో ఉన్నారు ఎందుకంటే అన్ని షాపులకి అనుమతి ఉందా లేక దానికి తగిన గైడ్లైన్స్ ఏంటి అనేదానికోసం ఎదురు చూస్తున్నారు.
