వాట్సాప్ తో మోసాలు… హ్యాకర్ల చేతికి చిక్కితే ఇక అంతే సంగతి…
1 min read
మెస్సేజ్ లు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణుల సూచన..
ఎంత టెక్నాలజీ పెరిగితే అంత మోసాలు ఎక్కువవుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంది. అంటే మన స్మార్ట్ మొబైల్ లోనే ఉంది. మన మొబైల్ నుండి ప్రపంచం లో ఎక్కడున్న వారికైనా సందేశాలను పంపుకోవచ్చు. అందులో ప్రపంచం అంతా ఉపయోగించేది వాట్సాప్ అని చెప్పొచ్చు. వాట్సాప్ ని ఉపయోగించని వారు ఉండరేమో.
ఎక్కువ మంది ఉపయోగించే యాప్ కాబట్టే, మోసగాళ్ళు దీన్ని ఉపయోగించుకొని మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ వినియోగదారులకు ప్రకటనల రూపంలో లింక్ లు పంపుతున్నారు. వినియోగదారులు అది చూసుకోకుండా లింక్ తెరిస్తే ఇక అంతే సంగతి. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇప్పుడు వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది. వినియోగదారులకు మీరు జియో ప్లాన్ ని ఉచితంగా పొందండి అని వాట్సాప్ మెస్సేజ్ తో పాటు లింక్ పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు రూ. 550 ప్లాన్ ని ఉచితంగా పొందవచ్చని ఉంటుంది.
అయితే పొరపాటున ఆ లింక్ ని క్లిక్ చేస్తే అంతే సంగతి. మీ మొబైల్ లేదా కంప్యూటర్ల లో ఉన్న డేటా మొత్తం దొంగలించ బడుతుంది. మీ సమాచారం మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ సమాచారం తో హ్యాకర్లు, మీ ఖాతాలోని డబ్బును మొత్తం స్వాహా అనిపిస్తారు.
కాబట్టి ఇలాంటి మెస్సేజ్ లు వస్తే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
