కరోనా వైరస్ పుట్టుకపై విచారణ, ఆసక్తికర విషయాలు బయటపెట్టిన అరోగ్య సంస్థ
1 min read
కరోనా వైరస్ పుట్టుకపై విచారణ, ఆసక్తికర విషయాలు బయటపెట్టిన అరోగ్య సంస్థ
కరోనా మూలం దొరకలేదు కరోనా మహమ్మారి సంవత్సరకాలంపైగా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 12.84 కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా 28.07 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. 10.35 కోట్ల మంది కోలుకున్నారు. 220 లక్షల యాక్టివ్ కేసులున్నాయి, వారిలో లక్ష మంది పరిస్థితి క్లిష్టంగా ఉంది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్యం, అహంకారానికి అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంది. 310 లక్షలమందికి పైగా వ్యాధి బారిన పడగా 5,63,259 మంది అర్థాంతరంగా తనువు చాలించారు. అధ్యక్షుడు బోల్సోనార్ నిర్లక్ష్యం వల్ల 1,25,77,354 కేసులు, 3,14,268 మరణాలతో బ్రెజిల్ కుదేలవుతోంది. కాగా 1,21,06,756 కేసులు, 1,62,218 మరణాలతో భారత్ మూడవ స్థానంలో ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్యవ్యవస్థలకు పెనుసవాలుగా మారిన కోవిడ్ -19 మహమ్మారి, ప్రజారోగ్యంలో ప్రైవేటురంగానికి పెద్ద పీట వేసిన నయా ఉదార విధానాల దుష్ఫలితాన్ని ప్రభుత్వాల, ప్రజల స్వానుభవంలోకి తెచ్చింది. అయినా అత్యధిక దేశాలు గుణపాఠాలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇదిలావుండగా కోవిడ్ -19 సెకండ్ వేవ్ భయకరంగా విస్తరిస్తోంది. భారత్ , రష్యా , పోలెండ్ , ఇరాన్ , ఉక్రేన్ దేశాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది.
పలుదేశాల్లో టీకా కార్యక్రమం జరుగుతున్నా అది చివరి మనిషికి చేరేసరికి సంవత్సరకాలం పట్టవచ్చు. ఇందులోనూ పేద దేశాలదే చివరి స్థానం. అయితే కరోనా సూక్ష్మ క్రిమి ఎక్కడనుండి, ఎలా వ్యాప్తి చెందిందో శాస్త్రవేత్తలకు ఇంతవరకు అంతుచిక్కలేదు. ట్రంప్ నాయకత్వంలో బడా పెట్టుబడిదేశాలు చైనాను నిందించినా అది నిర్ధారణ కాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ – చైనా సంయుక్తంగా జరిపిన అధ్యయనం చైనా ప్రయోగశాల నుండి క్రిమి లీక్ అయ్యే అవకాశాన్ని దాదాపు తోసిపుచ్చింది. అయితే గబ్బిలాల నుండి మరో జంతువు ద్వారా మనుషులకు సోకిందనటానికి ఎక్కువ ఆధారాలున్నట్లు ధృవీకరించింది. అయితే ప్రయోగశాల లీక్ ఊహను మినహాయించి మిగతా అన్ని కోణాల్లో మరింత పరిశోధన చేయాలని ఆ బృందం నిర్ణయించింది.
చైనా నగరం ఉహాన్లో తొట్టతొలి కోవిడ్ కేసు బయటపడింది. చైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వైద్యబృందాలను సమీకరించి ఆ వ్యాధి జాడ లేకుండా చేసింది. ఈ లోపు ఇతర దేశాలకు ప్రయాణాల ద్వారా విస్తరించింది. ఏదైనా ఒక వైరసను కనిపెట్టటానికి దశాబ్దాలు పడుతుంది. ఎబోలా వ్యాధి విజృంభణ 40 సంవత్సరాలు దాటిపోయింది. గబ్బిలాల్లో ఏ జాతి దీనికి కారణమో కచ్చితంగా ఇంతవరకు నిర్థారణ కాలేదు. క్యాన్సరకు, ఎయిడ్స్ కు ఇప్పటికీ సరైన చికిత్స లేదు. కోవిడ్ -19 అధ్యయన శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం నాలుగు కారణాలను ఊహిస్తోంది. మొదటిది , గబ్బిలాల ద్వారా మరో జంతువుకు సోకి దాని నుండి మనిషికి సోకటం. రెండు, గబ్బిలం నుండి నేరుగా మనిషికి. మూడు, శీతలీకరణ వర్తక మార్గాల ద్వారా ప్యాకేజీ ఆహార పదార్థాల నుండి మనుషులకు. నాలుగు – అతి తక్కువ అవకాశం– కరోనా క్రిమితో కలుషితమైన ఆహార ప్యాకేజిలను ఉహానకు తీసుకురావటం, అక్కడ మను షులకు సోకటం. ఈ అవకాశాన్ని డబ్ల్యుహెచ్ఓ, అమెరికా డిసీజ్ కంట్రోలు, ప్రివెన్షన్ కేంద్రాలు గతంలో తిరస్కరించాయి. అయినా పరిశో ధకులు ఆ కోణాన్ని కూడా అధ్యయనం చేయాలంటున్నారు. ఏమైనా, శాస్త్రవేత్తలు వారి పని వారు కొనసాగిస్తారు. మనుషులుగా మనం రక్షణ చర్యలు నిర్లక్ష్యం చేస్తే, తాత్సారం వహిస్తే ప్రమాదం ముంచు కొస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
