తెలంగాణ జీరో బడ్జెట్ చిత్రంగా శరపంజరం
1 min read
Sharapanjaram
తెలంగాణ నేపథ్యంలో ప్రయోగాత్మక చిత్రం శరపంజరం
తెలుగు చిత్రపరిశ్రమలో తెలంగాణ సంసృతి, సాంప్రదాయలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కిన బలగం,దసరా వంటి చిత్రాలకు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభించింది. తెలంగాణా సంస్కృతిలో ఒక వ్యక్తి మరణం తర్వాత జరిగే తంతును కథగా ఎన్నుకుని మానవ సంబంధాలను,అనుబంధాలను వివరిస్తూ సిరిసిల్ల గ్రామ పరిసరాల్లో చిత్రీకరించి పల్లెటూరి యాసలో పాత్రల చిత్రీకరణతో రూపుదిద్దుకొన్న బలగం చిత్రం ఘనవిజయం సాధించింది. అదేవిధంగా సింగరేణి బొగ్గు కార్మికుల జీవన విధాన శైలి,తెలంగాణ ఆచార వ్యవహారాలు పండుగలు నేపథ్యంలో ఒక ఊర్లో జరిగిన రాజకీయాలు, ముక్కోణ ప్రేమ కథను వివరిస్తూ నాని, కీర్తి సురేష్ లు కథానాయిక, నాయకులుగా తెరకెక్కిన దసరా చిత్రం కూడా చక్కని విజయాన్ని అందుకుంది.

బలగం, దసరా చిత్రాల తర్వాత అదే జాబితాలో వస్తున్న మరో చిత్రం శరపంజరం. ఒక గంగిరెద్దుల సామాజిక కుటుంబానికి చెందిన యువకుడు మరియు జోగిని యువతికి మధ్య నడిచే ప్రేమ కథ. దొరలకాలంలో తెలంగాణలో పరిస్థితులు, మూఢనమ్మకాలు, బానిసత్వంలో మగ్గే ప్రజల బతుకులు, అప్పటి మానవ సంబంధాలను వివరిస్తూ ఈ శరపంజరం మనముందుకు రాబోతోంది. తెలంగాణ లోని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం అమ్మాపురం, కంఠాయపాలెం గ్రామ పరిసర ప్రాంతం నుండి వచ్చిన నవీన్ కుమార్ గట్టు స్వీయ దర్శకత్వంలో కథానాయకుడుగా నటించడం జరిగింది. ఇందులో లయ కథానాయిక కాగా, జబర్దస్త్ జీవన్ , వెంకీ, రాజమౌళి నటించారు.

నిన్న రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన శరపంజరం సినిమా ప్రివ్యూ ను పంచాయతీ రాజ్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చిత్ర బృందంతో కలిసి చూడడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఒక సినిమా నిర్మించాలంటే కోట్లు వెచ్చించాల్సివస్తున్న పరిస్థితుల్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్నేహితులందరూ కలిసి ఒక జట్టుగా ఏర్పడి చక్కని సందేశం గల సినిమా నిర్మించడమన్నది చాలా గొప్ప విషయమని కొనియాడారు. సినిమా అంతా గ్రామీణ వాతావరణంలో సాగుతున్ననేపథ్యంలో ఒక్క సారిగా బాల్య జ్ఞాపకాలను తట్టిలేపిన అనుభూతికి లోనయ్యానన్నారు. ఇందులో నటించిన నటీ నటులు జబర్దస్త్ జీవన్ , వెంకీ, రాజమౌళి, భాషాలను అభినందించారు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థలతో మాట్లాడి త్వరలో ఈ చిత్రాన్నివిడుదల చేయడానికి తనవంతు తోడ్పాటు ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని సూచించారు. దర్శకుడు నవీన్ కుమార్ గట్టు, కెమెరామెన్ మస్తాన్ సిరిపాటి, సంగీత దర్శకుడు ఎంవీకే మల్లిక్ మరియు సినిమాకి సహాయ సహకారాలనందించిన టి గణపతిరెడ్డి గార్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ చిత్రంలోని పాటను, నాలుగు నిమిషాల సన్నివేశాన్ని విడుదల చేశారు. ఆ సందర్భముగా ఆయన సినిమా సాంకేతిక నిపుణులను ప్రశంసించారు . సినీ పాటల రచయిత చంద్రబోస్ మంచి తెలంగాణ సంస్కృతి కి అద్దం పట్టె చిత్రమని కొనియాడారు. సంగీత దర్శకుడు ఆర్పీపట్నాయక్ కెమెరామెన్ ప్రతిభను మెచ్చుకున్నారు. విరాటపర్వం సినిమా దర్శకుడు వేణు ఉడుగుల కూడా ఈ చిత్రం లోని ఒక పాటను విడుదల చేసారు. అలాగే ఈ చిత్రం లో యం. యం. శ్రీలేఖ ఒక పాటను పాడటం జరిగింది.
దర్శకుడు నవీన్ కుమార్ గట్టు మాట్లాడుతూ నిరుపేద కుటుంబం లో పుట్టిన తనకు కళలంటే విపరీతమైన ఇష్టమని, చిన్నప్పటినుండి తెలంగాణ ప్రాంత మట్టి మనుష్యుల జీవన విధానాన్ని దగ్గరగా గమనించి వారిచే ప్రభావితుడనై, అనేక కథలు రాసుకుని దృశ్యరూపం తేవడానికి నిర్మాతల కోసం ప్రయత్నించి విసిగి వేసారిపోయిన తనలో మెదిలిన ఓ ఆలోచనే ఈ జీరో బడ్జెట్ చిత్రం శరపంజరమన్నారు.
సినిమా నిర్మాణ ప్రయత్నంలో భాగంగా మొదలు కెమెరామెన్ మస్తాన్ సిరిపాటిని తోడు చేసుకొని తర్వాత సంగీత దర్శకుడు ఎంవీకే మల్లిక్ సహాయంతో టి గణపతిరెడ్డి ప్రోత్సాహంతో ఎన్నో ప్రయాసలకు ఓర్చి, కరోనా విపత్కాలం నుండి బయటపడి మొత్తానికి ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేశామని తెలిపారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
