సిస్టర్స్ రాఖీ …. బ్రదర్స్ బాకీ … Story behind raksha bandhan
1 min read
Rakshabandhan Traditional Story
ఆన్లైన్లో రాఖీలు… ఫోన్ పే లో పేమెంట్లు…
ఓ చెల్లి తన అన్నయ్యకు రాఖీ కడుతూ వాళ్ళ అన్నయ్యను .. అరేయ్ అన్నయ్యా ఈ రాఖీ పండక్కి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావ్.. రా .. అని హక్కుతో, ప్రేమతో అడుగుతుంది. ఆ మాటలు విన్న అన్నయ్య.. ఏ పోవే నా బ్లెస్సింగ్స్ ఇవ్వడమే ఎక్కువ నీకు అని చెల్లిని ఆట పట్టించడం.దీంతో అమ్మ చూడే అన్నయ్య అంటూ అమ్మకు కంప్లైంట్ ఇవ్వడం.. అమ్మ కలగచేసుకుంటూ పండుగరోజు దాన్ని ఆలా ఏడిపిస్తావ్ ఏంటిరా అంటూ వాళ్ళ అల్లరిని ఆపడం.. ఆ తర్వాత రాఖీ కట్టే ప్రోగ్రామ్ అయ్యాక అందరూ కలిసి స్వీట్స్ తింటూ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ చూసి చెల్లి మురిసిపోవడం తర్వాత జాలీగా ఆడే అంత ఎంజాయ్ చేయడం అనేదే ఈ జనరేషన్ రాఖీ సెలెబ్రేషన్స్..
కానీ అసలు రాఖీ పౌర్ణమి అంటే ఏమిటి? రక్షా బంధన్ ను ఎందుకు జరుపుకుంటాం.. దీని వెనుక అసలు కదా ఏంటో ఓసారి చూద్దాం ..
రాఖీ పౌర్ణమి.. దీనినే శ్రావణ పౌర్ణమి,జంధ్యాల పౌర్ణమి అంటారు. జంధ్యం ఆంటే యజ్ఞోపవీతం..నూలు పోగులతో తయారు చేసిన పవిత్రమైన దారం అని అర్ధం. ఇది వేసుకుంటేనే యజ్ఞాలు చేయడానికి అర్హులు. ఈ పౌర్ణమి రోజునే మలిన పడిన,తెగిపోయిన జంధ్యాలను గాయత్రి జపం చేసి మార్చుకుంటారు. అంటే ఈరోజుకు,ఆ నూలు పోగుతో తయారు చేసిన ఆ దారానికి అంత పవిత్రత అన్నమాట. అదేవిధంగా రాఖీ పౌర్ణమి రోజుని పోగు పౌర్ణమి అనికూడా అంటారు.ఈరోజున అంతే పవిత్రంగా అక్కా చెల్లెల్లు అన్నదమ్ముల చేతికి నూలు పోగుతో తయారు చేసిన రాఖీ కడతారు.

రాఖీ సంగతి సరే మరి ఈ పండుగ జరుపుకోడానికి అసలు కారణం ఏంటి?అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములకు రాఖీ ఎందుకు కడతారు? అన్న దానిపై పురాణాల్లో,చరిత్రలో చాలా కధలే ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
మహాభారతంలో శ్రుత దేవికి శిశుపాలుడు అనే పిల్లవాడు మూడు కన్నులు నాలుగు చేతులతో అందవిహీనంగా పుడతాడు. శ్రుత దేవి శ్రీకృషుడి మేనత్త .ఎవరి చేతులు తాకితే నీ బాలుడు మాములుగా అవుతాడో వాళ్ళచేతిలోనే ఈ పిల్లవాని చావు ఉంటుందని ఒక మునీశ్వరుడు ఆమెకు చెబుతాడు.ఒకరోజు ఆ పిల్లవాడిని చూడడానికి శ్రీకృష్ణుడు వస్తాడు. అప్పుడు శ్రుత దేవి ఆ పిల్లవాడిని శ్రీకృష్ణుడి చేతిలో పెడుతుంది. వెంటనే మాములుగా మారుతాడు ఆ బాలుడు. ఒక వైపు తన పిల్లవాడు మంచిగా మారాడు అని సంతోషపడుతూనే మరో వైపు ఆ పిల్లాడి మరణం కృష్ణుడి చేతిలోనే ఉంటుందని భయపడుతూ.. నా కుమారుడు ఏదైనా తప్పుచేస్తే క్షమించి చంపకుండా వదిలేయమని కోరుకుంటుంది. తన మేనత్త కోరిక మేరకు ఒక షరతుతో వరమిస్తాడు. .అదేంటంటే 100 తప్పుల వరకు క్షమిస్తా దాని తర్వాత మాత్రం కాపాడటం ఉండదు అని చెప్తాడు.
ఆ తరువాత శిశుపాలుడు పెద్దయ్యి ఛేది రాజ్యానికి రాజు అవుతాడు.ఆ తరువాత ఒకసారి పాండవులు రాజసూయ యాగానికి శ్రీకృష్ణుడిని పిలుస్తారు. ఆ సభలో శ్రీకృష్ణుణ్ణి ఘోరంగా అవమానిస్తాడు శిశుపాలుడు.నూరు తప్పులవరకు క్షమించిన శ్రీకృష్ణుడు ఇక సహనాన్ని కోల్పోయిన సుదర్శన చక్రాన్ని శిశుపాలునిపై ప్రయోగిస్తాడు. దీనితో శిశుపాలుడు ప్రాణాలు కోల్పోతాడు. ఆ సుదర్శన చక్రం ప్రయోగించే సమయంలో శ్రీకృష్ణుని వేలు తెగుతుంది. అక్కడే ఉన్న ద్రౌపది వెంటనే తన చీర కొంగు చించి కృష్ణుడి వేలుకి కట్టు కడుతుంది.నా వేలు నొప్పిని గ్రహించి నన్ను అన్నలా భావించి కట్టు కట్టావ్ కదా నువ్వు ఏ ఆపదలో ఉన్న నన్ను తలుచుకో వెంటనే ఆ ఆపదనుండి రక్షిస్తా అని అభయమిస్తాడు. దీనితో ఆ తరవాత నిండు సభలో కౌరవులు ద్రౌపదిని అవమానిస్తుండగా అడ్డుకుంటాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటనకు గుర్తుగా రక్షా బంధన జరుపుతారని ,అప్పటి నుండి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అక్క చెల్లెళ్ళ తన అన్నదమ్ముళ్లకు రాఖీ కడతారు. దీనికి బదులుగా తోబుట్టువులకు ఏ ఆపద వచ్చినా రక్షణగా ఉంటామని మాట ఇస్తారు అన్నదమ్ములు.అని పురాణాలు చెబుతున్నాయి.
చరిత్ర ప్రకారం చూసుకుంటే ఒకసారి గ్రీకు దేశపు రాజు అలెగ్జాండర్ భారత దేశంలోని తక్షశిల అనే రాజ్యం పై దండెత్తుతాడు. తక్షశిలకు రాజు పురుషోత్తముడు. మహా శక్తివంతుడు. అప్పటికే పురుషోత్తముని శక్తి సామర్థ్యాలు తెలిసిన అలెగ్జాండర్ భార్య రుక్సానా పురుషోత్తముడిని మీరు నా అన్నలాంటి వారు అని తన భర్త అలెగ్జాండర్‌ను చంపవద్దని రాఖీ కట్టి పురుషోత్తముడిని కోరుతుంది.దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు. దీనికి గుర్తుగా కూడా రాఖీ పౌరంమీ జరుపుతారని చరిత్ర చెబుతుంది.
ఈ విధంగా పూర్వం ప్రమాదాలు, ఆపదల నుండి రక్షణ పొందేందుకు,ఏదైనా మంచి పనిని మొదలు పెట్టినప్పుడు ఏ ఆటంకం కలగకుండా కట్టుకునే పవిత్రమైనది ఈ రక్షా భందన. సాంప్రదాయంగా రాఖీ పౌర్ణమి రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి, రక్షకు పూజ చేసి అన్నదమ్ములకు బొట్టు పెట్టి మధ్యాహ్న వేళ పవిత్రమైన పద్దతిలో కట్టే రాఖీ. కానీ ఇప్పుడు అక్కచెళ్ళళ్ళు ఆన్లైన్లో రాఖీలు పంపడం అందుకు బదులుగా అన్నదమ్ములు ఫోన్ పేలో పేమెంట్ చేయడం దాకా వచ్చింది.
