రికార్డు సృష్టించిన కేరళ మహిళ, Kerala women created history
1 min read
ఆర్య రాజేంద్రన్-Arya Rajendran
దేశంలోనే అతి చిన్న వయసులో మేయర్ బాధ్యతలు చేపట్టిన ఘనత దక్కించుకుని మహిళా శక్తిని చాటి చెప్పారు ఆర్య రాజేంద్రన్ . కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్‌గా సోమవారం నాడు ఆమె ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత చేపట్టారు . నగరపాలక సంస్థ కౌన్సిల్ హాలులో జరిగిన సమావేశంలో కలెక్టర్ నవ జ్యోత్ ఖోస ఆమెతో మేయర్‌గా పదవీ ప్రమాణం చేయించారు. వయసురీత్యా ఎన్నికల్లో మొదటిసారి ఆమె తన ఓటు హక్కు వినియో గించుకోవడం మరో విశేషం . మేయర్ పదవి చేపట్టిన ఆర్యకు 21 సంవత్సరాలు. “ రాష్ట్ర రాజధానిలో వేస్ట్ మేనేజ్ మెంట్ నిర్వహణే తన ప్రథమ ప్రాధాన్యం ” అని ఈ సందర్భంగా ఆర్య చెప్పారు .
తిరువనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పిన్న వయస్కురాలుగా ఆర్య రాజేంద్రన్ దేశంలో రికార్డులకెక్కారు . కళాశాల స్థాయి నుంచి సిపిఎం అనుబంధ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( ఎస్ఏఎ ) విద్యార్థి సంఘంలోనూ , మార్క్సిస్టుపార్టీ సభ్యురాలుగానూ చురుకైన పాత్ర నిర్వహిస్తూ, ఎస్ఎస్ఏ రాష్ట్ర కమిటీ సభ్యురాలు స్థాయికి ఎదిగారు ఆర్య. వామపక్ష బాలల విభాగం ‘ బాలసంఘం ‘ రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా ఆమె పనిచేస్తున్నారు. తిరువనంతపురంలోని అల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ సెకండియర్ చదువుతున్నారు ఆర్య రాజేంద్రన్ . ఆమె చురుకుదనం , చాకచక్యం చూసి ముచ్చటపడిన మార్క్సిస్టు పార్టీ తమ అభ్య ర్థిగా తిరువనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల బరిలోకి దింపింది. ముదవన్ ముగల్ వార్డు నుంచి వామపక్ష ప్రజాసంఘటన అభ్యర్థిగా పోటీచేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పై 549 ఓట్ల తేడాతో గెలుపొందారు . ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి 51 సీట్లు గెలుచుకోగా , బిజెపి 34 , యుడిఎఫ్ 10 సీట్లు , ఇతరులు ఐదు సీట్లు గెలుచుకున్నారు . ఎల్డీఎఫ్ కూటమి నుంచి మేయర్ పదవికి పోటీదారులుగా బరిలో దిగిన ఇద్దరు సిపిఎం నేతలు ఓటమి చవిచూ డటంతో , మేయర్ పదవికి స్థానిక నేతలు యువతి ఆర్య రాజేంద్రన్ పేరును తెరపైకి తెచ్చారు .
బిజెపి..ఎ.ఎ , కాంగ్రెస్ నాయకత్వాన గల యుడిఎస్లు మేయర్ పదవికి బరిలోకి దించిన అభ్యర్థులతో సోమవారం నాడు సమావేశం పోటీ అనివార్యమవడంతో, 100 మంది సభ్యులున్న నగరపాలక సంస్థలో ఇండిపెండెంట్ సభ్యులతోపాటు 54 మంది ఆర్యకు అనుకూలంగా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆర్య రాజేంద్రన్ కు పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. ఆమెకు అభినందనలు తెలిపినవారిలో నటుడు , రాజకీయ నాయకుడు కమలహాసన్ , పారిశ్రామికవేత్త , ఆదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆదాని వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. “ తిరువనంతపురంలోనే కాదు , భారతదేశంలోనే , మేయర్ పదవి చేపట్టిన అతి పిన్నవయస్కురాలివైన ఆర్య రాజేంద్రన్ నీకు శుభాభినందనలు. ఇది సంపూర్ణంగా భారత ప్రజలకు లాభం చేకూర్చే అత్యుత్తమమైన విజయం , ఇతరులు అనుసరించడానికి ఎంతో స్ఫూర్తినిచ్చే విజయం, ఇన్ క్రెడిబుల్ ఇండియా ! ” అని ఆదాని ట్వీట్ చేశారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం , ఇప్పటివరకు దేశంలో 23 ఏళ్ళ వయసు గల కొల్లం నగరపాలకసంస్థ మేయర్ సబితా బేగం పిన్న వయసులో మేయర్ పదవి నిర్వహిస్తున్న యువతిగా పేరొందారు . 2006 లో తమిళనాడులో 24 ఏళ్ల వయసుగల రేఖ ప్రియదర్శిని సేలం మేయర్‌గా పని చేశారు . బిజెపి సీనియర్ నాయకుడు , మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా 27 ఏళ్ళ చిన్న వయసులోనే నాగపూర్ మేయర్ గా బాధ్యతలు చేపట్టారు .
