ఇప్పటి వరకు దీనిపై నోరు మెదపని TRS
1 min read
763810 Rtp
అత్యంత కీలకమైన బడ్జెట్ కు సంబంధించి రాజకీయ పార్టీలు అనుకూలంగానో , వ్యతిరేకంగానో మాట్లాడడం మొదటి నుంచి వస్తోంది. లోపాలను ఎత్తి చూపే వారు కొందరైతే బడ్జెట్ బ్రహ్మాండం అనే వారు మరి కొందరుంటారు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు తమకు తగ్గిన కేటాయింపులపైన విమర్శనాస్త్రాలు సంధించడం సహజమే. 2021-22 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరిగ్గా 10 రోజులు అవుతుంది. ఆ తర్వాత టిఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సమావేశం కూడా జరిగింది. కానీ ఆ పార్టీ అధినేత సహా ఏ ఒక్క నేత బడ్జెట్ పై మాట్లాడిన దాఖలాలు లేవు. ఒకవేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి సానుకూలంగా ఉంటే ఆ బడ్జెట్ ను స్వాగతించాలి. కానీ బడ్జెట్లో తెలంగాణకు సంబంధించి స్వాగతించదగిన అంశాలు ఏమీ లేవని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కోట్లాది మందికి బతుకు దెరువు మార్గంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గణనీయంగా నిధులలో కోత విధించారు. గతేడాది బడ్జెట్ లో జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ .1.11 లక్షల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది కేవలం రూ .70 వేల కోట్లను మాత్రమే కేటాయించారు. ఆర్థిక వేత్తల అంచనా ప్రకారం దాదాపు రూ.100 కోట్ల పని దినాలను కోల్పోయే ప్రమాదం ఉంది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సంబంధించిన ఊసే లేదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానమైన డిమాండ్లలో ఏ ఒక్క దాని పట్ల సానుకూలత బడ్జెట్ మొత్తంలో కానరాలేదు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల పైనా, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా స్పందించాల్సిన అవసరం టిఆర్ఎస్ పైన ఉంది కానీ స్పందించ లేదు. వ్యవసాయ సంస్కరణ చట్టాలపై తొలుత వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి జాతీయ బంద్ కార్యక్రమాల్లోనూ టిఆర్ఎస్ పాల్గొంది. తర్వాత ఏం జ్ఞానోదయం అయిందో కానీ సాగు చట్టాలను అమలు చేస్తామన్నారు. బిజెపి మిత్రపక్షాలు బడ్జెట్‌ను స్వాగతించగా మిగిలిన పక్షాలు వ్యతిరేకించాయి. వ్యతిరేకించని, బహిరంగంగా స్వాగతించని టిఆర్ఎస్ బిజెపికి మిత్రపక్షమా, శత్రుపక్షమా తేలాల్సి ఉంది. ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ పదునైన మాటలతో విమర్శలు చేసే టిఆర్ఎస్ నేతలు ప్రధానమైన బడ్జెట్ పై మాట్లాడకపోవడం రాజకీయ చర్చకు దారితీస్తుంది. కాంగ్రెస్ లేదా ఇతర పక్షాలు ఆరో పిస్తున్నట్లుగా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ సాగు తుందా ? కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత వచ్చిన ఆకస్మిక మార్పు దేనికి సంకేతం. బిజెపితో శత్రుత్వం ప్రమాదమని టిఆర్ఎస్ భావిస్తున్నదా అనే అంశాలపై ఎడతెగని చర్చ సాగుతుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ప్రజాక్షేత్రం నుంచి వస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పా ల్సిన పరిస్థితి టిఆర్ఎస్ కు ఏర్పడుతుంది. అదే టిఆర్ఎస్ భవిష్యత్తును నిర్దేశించవచ్చు.
