ముదిరిన స్టీల్ ప్లాంట్ పంచాయితీ…
1 min read
Visakha Steel Plant Privatisation
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విజయవాడలో ఎఐటియుసి శనివారం ఉదయం నిర్వహించిన అఖిలపక్ష , ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తక్షణం స్పందించి అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశం డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో సోమవారం నుంచి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలను కలుపుకుని రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ‘ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుందాం… ప్రైవేటీకరణను అడ్డుకుందాం .. ‘ అనే అంశంపై విజయవాడ హనుమాన్ పేట దాసరి భవన్లో ఎఐటియుసి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్న ఈ సమావేశానికి ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓ బులేసు అధ్యక్షత వహించారు.
“ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 23 జిల్లాల ప్రజలు ‘ విశాఖ ఉక్కు … ఆంధ్రుల హక్కు ” అని ముక్త కంఠంతో నినదిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. కర్మాగార నిర్మాణం కోసం వేలాది మంది రైతులు 26 వేల ఎకరాల పంట పొలాలను త్యాగం చేశారు. ఆ ఫలితంగానే విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడింది. విశాఖ ఉక్కు పరిశ్రమ కేవలం ఒక ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు. ఆంధ్రుల ఆత్మాభిమాన ప్రతీక. దీనిని అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాలి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు … ” అని సమావేశంలో పలువురు వక్తలు ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరై మాట్లా డుతూ, ప్రభుత్వరంగ సంస్థల్లోని పెట్టుబడుల ఉపసంహరణ విధానం అమలు చేసేందుకు నరేంద్ర మోడీ సర్కారు కరోనా విపత్కర కాలాన్ని తెలివిగా వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు కేంద్రం మూడు , నాలుగేళ్ళుగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఒడిశాలో ప్రజలు తిరస్కరించిన పోస్కో కంపెనీకి విశాఖ ఉక్కు పరిశ్రమ భూముల కేటాయింపు , క్యాపిటల్ మైన్స్ కేటాయించకపోవడం, నష్టాల భర్తీకి ఆర్థిక చేయూత అందించక పోవడం లాంటి చర్యలన్నీ కేంద్రం ప్రయత్నాల్లో భాగమేనని విమర్శించారు.
విశాఖ ఉక్కు కర్మా గార ప్రైవేటీకరణను రాష్ట్రంలో బిజెపి వ్యతిరేకిం చడం శుభపరిణామని చెబుతూ, బిజెపి ఎంపి సుజనా చౌదరి వైఖరిపై మండిపడ్డారు. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి అవసరమైతే రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని, అఖిలపక్ష బృందంతో ఢిల్లీ వెళ్లి ఒత్తిడి తేవాలని కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ నెల 14 న ఢిల్లీ వెళ్లి తమ పార్టీ పెద్దలను కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే, ఆయన వెంట అన్ని పార్టీల నేతలను కూడా తీసుకువెళ్లి ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు. ఆంధ్రుల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కు ప్రైవే టీకరణను వ్యతిరేకించనివారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తూ, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని కార్మిక సంఘాలు కేంద్రం వెనక్కి తగ్గే వరకు పోరాటం కొనసాగించాలని సూచించారు. విశాఖపట్నం , ఉత్తరాంధ్రలపై నిజ మైన ప్రేమ ఉంటే వెంటనే ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరే కించాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ( నాని ) డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించలేకపోయిన జగన్‌మోహన్‌రెడ్డి, కనీసం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ నైనా అడ్డుకోవాలన్నారు. విజయవాడలో పెద్ద ఎత్తున ఆనాడు జరిగిన ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ గుర్తుచేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ప్రైవేటీక రిస్తే ఎస్సీ, ఎస్టీ , బిసిలు తీవ్రంగా నష్టపోతారని , ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు ఉండవని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరణశాసనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు.
