మయన్మార్‌లో దారుణం, ప్రపంచ దేశాల ఆగ్రహం
1 min read
మయన్మార్‌లో దారుణం, ప్రపంచ దేశాల ఆగ్రహం
మయన్మార్‌లో సైన్యం సుమారు వందమందిని కాల్చి చంపినప్పటికీ అక్కడి ప్రజాస్వామ్యవాదులు మొక్కవోని దీక్షతో 24 గంటల వ్యవధిలోనే ఆదివారం నాడు తిరిగి రోడ్లమీదకు వచ్చారు. సైన్యం ఆగడాలు సహించేది లేదని, ప్రజాస్వామ్యాన్ని మయన్మార్‌లో పునరుద్ధరించాలని వారు తమ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.
నిరసన ప్రదర్శకులు యాంగాన్, మాండలే రెండు పెద్ద నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. శనివారంనాడు సైన్యం పాశవికంగా జరిపిన కాల్పుల్లో తొలుత 93 మంది ప్రజాస్వామ్యవాదులు మరణించారని వార్తలు వచ్చినప్పటికీ తుది గణాంకాల ప్రకారం కనీసం 114 మంది మరణించినట్లు లెక్కల్లో తేలింది. సైన్యం జరిపిన కాల్పుల్లో గడచిన ఫిబ్రవరి 1 నుండి ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజాస్వామ్యవాదులు మరణించడం ఇదే ప్రథమం. నిన్న మరణించినవారిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు. 16 ఏళ్ళ వయసులోపు వారిని కూడా సైన్యం కాల్చి చంపింది. మయన్మార్ లోని ఇతర పరిశోధకులు మీడియా కూడా తమ అన్వేషణలో ఈ లెక్కలనే తేల్చాయి. శనివారంనాడు జరిగిన ఘటనతో మయన్మార్ పూర్తిగా అంతర్జాతీయంగా అందరి దృష్టిలోను పడింది. ఒకవైపు 114 మందిని సైన్యం పాశవికంగా కాల్చి చంపగా మయన్మార్ కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృత్యు ఘోష ఇళ్ళల్లో వినిపిస్తుండగా, మరోవైపు సైన్యం కాల్పులు జరిపిన రోజు రాత్రి జుంటా భారీఎత్తున పార్టీలు చేసుకుని ఉత్సవాల్లో మునిగితేలింది.
సాయుధ దళాల దినోవత్సవం సందర్భంగా శనివారంనాడు మయన్మార్ లో సైనిక తిరుగుబాటు చేసిన కుట్రదార్ల నేత మిన్ ఆంగ్ ప్లెయింగ్, అతడి సహచర సైనిక జనరల్స్ విలాసవంతమైన పద్ధతుల్లో పార్టీల్లో మునిగితేలారు. ఇంకోవైపు కాల్పుల్లో మరణించిన తమ బంధువుల మృతదేహాలకు ఆదివారం నాడు అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో కూడా సైన్యం తలదూర్చేందుకు ప్రయత్నించింది. మయన్మార్ లో సైనిక కుట్ర జరిగి ఇప్పటికి 56 రోజులు గడిచాయి. ఈ కాలంలో పలు పరిశోధనా సంస్థలు వేసిన అంచనాల ప్రకారం, ఇప్పటికే మయన్మార్ లో 420 మంది ప్రజాస్వామ్యవాదులు మరణించారు.
ఐరాస తీవ్ర దిగ్ర్భాంతి : ఇదిలాఉండగా, శనివారంనాడు జుంటా సైన్యం జరిపిన క్రూరమైన కాల్పుల దుశ్చర్యపట్ల ఐక్యరాజ్య సమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పిల్లలతో సహా యువ తరాన్ని కాల్చి చంపుతున్నారా ? అంటూ ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
ఈ విధంగా, ఇంత దారుణంగా సైన్యం అణచివేత చర్యలు అమానుషం, ఇది ఎంతమాత్రం సమ్మతించరాని విషయం, దీనిపై ఒక స్పష్టమైన, గట్టి, సమైక్య తతో కూడి ఒక తీర్మానాకి అంతర్జాతీయ ప్రపంచం కట్టుబడాలి ” అని ట్విట్టర్ వేదికగా ఆంటోరియో గుటెర్రెస్ స్పందించారు. ఇప్పటికే ఈ ఘటనను 12 దేశాలకకు చెందిన రక్షణశాఖామంత్రులు ఒక ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా , కెనడా, జర్మనీ, గ్రీస్, ఇటలీ, జపాన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికా దేశాల రక్షణ అధికారులు ఈ ఉమ్మడి ప్రకటన చేశారు.
