June 3, 2024

Digital Mixture

Information Portal

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో TRS టికెట్ వీరిలో ఎవరికి?

1 min read
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో TRS టికెట్ వీరిలో ఎవరికి?

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో TRS టికెట్ వీరిలో ఎవరికి?

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతుండగా , అధికార టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసే అవకాశం ఎవరికి వస్తుందనేది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల సాగర్ వచ్చినప్పుడు , కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వనున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. అయితే, స్థానికంగా మాత్రం రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొనగా, ఎవరికివారు కొత్త కొత్త సిద్ధాంతాలను ముందుకు తెచ్చి, టికెట్ ఫలానా వారికే వస్తుందంటూ బలమైన వాదన వినిపిస్తున్నారు. మొత్తం మీద అంతాకలిసి, అధికార పార్టీ అభ్యర్థి ఎవరనే అంశంపై అందరినీ సందిగ్ధంలో పడేస్తున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచిన నోముల నర్సింహ్మయ్య హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన మృతి చెందిన తర్వాత సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి పోటీ కూడా పెరిగింది. టిఆర్ఎస్ అభ్యర్థి ఆశావహుల జాబితాలో ఎంసి కోటి రెడ్డి , తేరా చిన్నపరెడ్డి , నోముల భగత్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి .

గడుస్తున్న కొద్దీ కొత్త పేర్లు తెరపైకివస్తున్నాయి. ఈ క్రమంలోనే దివంగత మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ కు స్వయానా అల్లుడైన కట్టబోయిన గురవయ్య యాదవ్ పేరు బలంగా వినిపిస్తున్నది. అంటే, అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతూ వస్తున్నదనేది వాస్తవం. కాగా, సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థిపై సిఎం కెసిఆర్ ఇప్పటికే పలు సర్వేలు చేయిస్తున్నారు. దీనిలో బిసి సామాజిక వర్గం నుంచి ఇద్దరు, ఓసిల నుంచి ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఎంసి కోటిరెడ్డి 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు. అయితే , అంతకుముందే నోముల నర్సింహ్మయ్య పేరును సిఎం ఖరారు చేశారు. అయినప్పటికీ కోటిరెడ్డి పట్టు సడలకుండా చివరి వరకు తీవ్ర ప్రయత్నం చేశారు. కార్యకర్తలు కూడా ఆయన వెంట కలిసి రావడంతో అధిష్టానం ఒక దశలో పునరాలోచనలో పడిందని అంటున్నారు. అయితే అధిష్ఠానం ఇరువర్గాలను పిలిపించి, నోముల నర్సింహయ్యకు మద్దతునివ్వాల్సిందిగా పార్టీ అధిష్టానం ఒప్పించింది. అనుకున్నట్టుగానే టిఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. అయితే ఎమ్మెల్యే నోముల నరసింహ్మయ్య రెండేళ్లలోనే మృతి చెందారు .

గత ఎన్నికల్లో అధిష్టానం చెప్పినట్లు నడుచుకున్న కోటిరెడ్డికి ఈసారి తప్పకుండా పోటీ చేసే అవకాశం దక్కుతుందనే వాదన వినిపిస్తున్నది. అయితే తండ్రి మరణంతో తాము తీవ్రంగా నష్టపోయామని, అందువలన పార్టీ తనకు పార్టీ టికెట్ ఇచ్చి ఆదుకోవాలని నోముల భగత్ కుటుంబ సభ్యులు సిఎంకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కూడా తనకు అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధమని సంకేతాలు పంపిస్తున్నారు. గత నెలలో హాలియా వద్ద జరిగిన బహిరంగ సభలో సిఎంతోపాటు హెలికాప్టర్ లో వచ్చిన చిన్నపరెడ్డి , తనకి టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు. అందుకు సంబంధించి నియోజక వర్గంలో జరుగుతున్న ప్రతి చిన్న కార్యక్రమానికి హాజరవుతూ పరోక్షంగా పోటీలో తను ఉన్నానని కార్యకర్తలకు సమాచారం ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే అధికార పార్టీలో కొత్త పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన కట్టెబోయిన గురవయ్య కూడా అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయన పేరు హాట్ టాఫిక్ గా మారింది. దినపత్రికల్లో కూడా గురవయ్య పేరు ప్రధానంగా ప్రస్తావిస్తూ కథనాలు వస్తుండటం విశేషం. మొత్తం మీద సాగర్ లో కారెక్కేది ఎవరనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. ఒకటి రెండు రోజుల్లో ఈ సస్పెన్స్కు తెరపడే అవకాశాలు ఉన్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *