అసెంబ్లీలో రచ్చ, హరీశ్ రావు వెర్సెస్ భట్టి విక్రమార్క
1 min read
అసెంబ్లీలో రచ్చ, హరీశ్ రావు వెర్సెస్ భట్టి విక్రమార్క
శాసనసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు , సిఎల్ పి నేత భట్టి విక్రమార్క మధ్య వాగ్వాదం జరిగింది. విద్యారంగం, రోడ్లు, వంతెనలపై జాతీయ సగటు కన్నా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ నిధులు ఇస్తున్నదని భట్టి వంటి సీనియర్ సభ్యులు సభను తప్పుదోవ పట్టించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ రెండు విభాగాల్లో కూడా జాతీయ సగటు కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నామని, అయితే ఎస్సీ, ఎస్టీ, బిసి , మైనారిటీల గురుకులాలపై చేస్తున్న ఖర్చు, ఫీజు రియింబర్స్మెంట్ ఖర్చు ఆయా శాఖల పద్దులో ఉండడంతో మొత్తం విద్యారంగంపై తక్కువ ఖర్చు చేస్తున్నట్లుగా ఉన్నదన్నారు. వీటన్నిటినీ కలుపుకొని తమ ప్రభుత్వం గత ఆరేళ్ళలో విద్యారంగంపై రూ .96,220 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దీనికి భట్టి విక్రమార్క స్పందిస్తూ, మీరు గురుకులాల నిధులను ఆ శాఖల ఖర్చులో చూపిస్తూ , ఇటు విద్యారంగంతో కలుపుతూ, రెండు చోట్ల చూపడం ఏమిటని ప్రశ్నించారు. బిసిలపై చిత్త శుద్ధి ఉంటే 50 శాతం జనాభా ఉన్న బిసిలకు రూ .2.30 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం రూ .5,620 కోట్లే కేటాయిస్తారా ? అని అన్నారు. హామీలన్నీ అమలు చేస్తున్నట్లయితే నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. నిజంగా మీకు విద్యారంగంపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకే తలమానికమైన ఉస్మానియా యూనివర్సిటీలో 3213 పోస్టులు ఉంటే, వైస్ ఛాన్సలర్ తో పాటు 2,064 పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని నిలదీశారు.
ప్రభుత్వ పూచీకత్తు పేరుతో తీసుకువస్తున్న బడ్జెటేతర అప్పులను కలిపి రాష్ట్రం అప్పులు రూ .3.91 లక్షల కోట్లకు చేరుకో వడం లేదా ? అని అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తూ ప్రైవేటు యూనివర్సిటీలకు పట్టం కట్టే కుట్ర చేస్తున్నారని అన్నారు. వాస్తవాలు కప్పిపుచ్చి మీరే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి అన్నారు. దీనికి ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ తాము యూనివర్సిటీ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టి, పరీక్షలు, ఇంటర్వ్యూల వరకు పూర్తి చేశామని, నియామక దశలో కోర్టు స్టే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ , బిజెపి ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తే , తాము విజయా డెయిరీ , ఆర్టీసి వాటిని నిలబెట్టామన్నారు. తాము ఆర్‌బిఐ , కేంద్ర ప్రభుత్వ పరిమితులకు లోబడే అప్పులు తీసుకువస్తున్నామని, ప్రభుత్వ పూచీకత్తుపై తీసుకువచ్చే అప్పుల్లో తప్పులేదన్నారు. ఉదాహరణకు రైతుల నుండి సేకరించిన ధాన్యానికి ముందే డబ్బులు చెల్లించేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ తీసుకున్న రూ .20 వేల కోట్ల అప్పుకు పూచీకత్తు ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు. ఆ అప్పును ఎఫ్ సిఐ నుండి ధాన్యానికి సంబంధించిన నిధులు రాగానే తిరిగి చెల్లించామన్నారు.
మీరు గెలిస్తే ఒప్పు .. మేము గెలిస్తే తప్పా ..
తాము చెప్పినవన్నీ అమలు చేస్తున్నందునే ఎంఎల్సి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందని, బడ్జెట్ అమలైతే రాష్ట్రం నుండే ఎలిమినేట్ అవుతుందనే భయం భట్టికి ఉన్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. మీరు కోట్లు పెట్టి గెలిచారని కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిగా అరిచారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు పదే పదే తన పేరును ప్రస్తావిస్తూ సభను తప్పుదోవ పట్టించారని సభలో వ్యాఖ్యానించడం, దానిపై స్పందించేందుకు స్పీకర్ తనకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల భట్టి విక్రమార్క మనస్థాపం చెందినట్లు తెలిసింది. ఈ విషయంలో స్పీకర్ కు లేఖ రాయాలని సిఎల్‌పి నిర్ణయించింది .
