#BalagamGoesGlobal: అరుదైన రికార్డుల దిశగా బలగం సినిమా…
1 min read
Balagam Movie towards rare records
ఆస్కార్ వైపుగా అడుగులు వేస్తున్న మరో తెలుగు సినిమా…
ఇటీవల కాలంలో చిన్న సినిమా గా విడుదలై భారీ విజయం సాధించిన బలగం మూవీకి అవార్డుల పరంపర కొనసాగుతుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన బలగం సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య హీరో, హీరోయిన్ లుగా, కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది. ఓటిటి మాధ్యమాల్లో కూడా ఈ సినిమా ట్రెండింగ్ లో నిలిచింది.
తెలంగాణాలో ఒక వ్యక్తి మరణం తర్వాత చేసే కార్యక్రమాల నేపథ్యంలో వచ్చిన బలగం సినిమా థియేటర్లలో గొప్ప హిట్‌గా నిలిచింది. మానవ సంబంధాలు, మానవతా విలువలు,ప్రజల జీవన విధానాన్ని తెలిపే చిత్రం కావడం వలన ఈ సినిమాకు గ్రామాల్లో ప్రజల ఆదరణ లభిస్తుండడడంతో ప్రేక్షకుల ఆసక్తిని గమనించిన గ్రామ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువజన సంఘాలు పోటీపడి మరి బలగం సినిమాను పంచాయతీల ఆవరణలో, స్కూల్ ఆవరణల్లో ప్రత్యేక షోలు వేసి ఉచితంగా చూపిస్తున్నారు.

బలగం సినిమా లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులలో రెండు పురస్కారాలను సాధించింది. ఉత్తమ దర్శకుడు విభాగంలో వేణు ఎల్దిండికి, ఉత్తమ ఛాయాగ్రహణం విభాగంలో ఆచార్య వేణు కు అవార్డులు దక్కాయి. ఒనికో ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఒనికో ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది.
ది గోల్డెన్ బ్రిడ్జ్ ఇస్తాన్‌బుల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2023లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ లీడ్ యాక్టర్ విభాగాల్లో మూడు అవార్డులను అందుకుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా అత్యంత అరుదైన రికార్డుని నెలకొల్పడం కోసం పల్లె పల్లె కు పరదా వేసి ప్రదర్శిస్తుండటంతో ఓ సంస్థ సర్వే చేసి ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షించిన సినిమా పేరిట రికార్డ్ నమోదు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా విడుదలయ్యాక అవార్డులే కాకుండా కొన్ని వివాదాలను సైతం మూటకట్టుకుంది. బలగం సినిమా దర్శకుడు వేణు ఈ కథను ఒక పుస్తకం నుండి కాపీ కొట్టారని ఓ వ్యక్తి మీడియా ముందు ఆరోపణలు కూడా చేశాడు. అంతే కాకుండా బలగం సినిమాని తెలంగాణ గ్రామాల్లో కొన్నిచోట్ల బహిరంగంగా ప్రదర్శించడం పై దిల్ రాజు నిజమాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విమర్శలు రాగా ఈ సినిమా హక్కులు ఓ టీ టీ కి ఇవ్వడం వలన ఓటీటీ సంస్థ తెచ్చిన ఒత్తిడి మేరకే పోలీసులకు నోటిస్ ఇచ్చామని పబ్లిక్ స్క్రీనింగ్స్ ను ఆపటం తమ ఉద్దేశం కాదని ఆయన వివరణ ఇచ్చారు.
